పురుగుల మందు సేవించి యువకుడి ఆత్మహత్య
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన మంద దేవేంద్ర(20) అనే యువకుడు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దేవేంద్ర బుధవారం తన ఇంట్లో పురుగుల మందుతాగగా, కుటుంబ సభ్యులు గమనించి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు.
వృద్ధురాలిని కత్తితో
బెదిరించి బంగారం చోరీ
ఖలీల్‌వాడి: నగరంలోని ఐదోటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 80 క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న నర్సమ్మ(75) అనే వృద్ధురాలిని దుండగులు కత్తితో బెదిరించి బంగారం ఎత్తుకెళ్లినట్లు ఎస్సై గంగాధర్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నర్సమ్మ 80 క్వార్టర్స్‌లో ఉంటుండగా, ఆమె కొడుకు మాధవనగర్‌లో, కూతురు హైదరాబాద్‌లో ఉంటున్నారు. బుధవారం రాత్రి దుండగులు నర్సమ్మ తలుపు తట్టారు. మాధవనగర్‌లో ఉంటున్న నీ కుమారుడికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో నర్సమ్మ తలుపులు తీసి బయటకు వచ్చింది. వెంటనే ఆమెను కత్తులు చూపించి బెదిరించి రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బైక్ చోరీకి యత్నం
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండల కేంద్రంలోని ఓ సైకిల్ షాపులో దుండుగులు చోరీకి పాల్పడ్డారని, అలాగే మసీద్ ముందున్న బైక్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని స్థానికులు గురువారం తెలిపారు. పోలీసులకు సమాచారం అందించామన్నారు. అర్ధరాత్రి పెట్రోలింగ్ చేసి చోరీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నిషేధిత గుట్కా పట్టివేత
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణంలో పోలీసులు బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టి నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు సంతోష్ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్‌లో తనిఖీ చేయగా, రూ.2.35 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయని, దుకాణం యజమానిపై కేసు నమోదు చేశామన్నారు. తనిఖీలో ఏఎస్సై లింబాద్రి, హెడ్‌కానిస్టేబుల్ సాయాగౌడ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment