4,484 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం
కామారెడ్డి అర్బన్: అగ్రికల్చర్ పోర్టల్ ద్వారా జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులను సాధ్యమైనంత తొందరగా మంజూరు చేస్తున్నట్టు ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ తెలిపారు. గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు 4,484 వ్యవసాయ సర్వీసులకు మంజూరు ఇవ్వగా, ఒక డిసెంబర్ నెలలోనే 679 సర్వీసులు మంజూరు చేసినట్టు వివరించారు. ఇది 2023తో పోల్చుకుంటే 45శాతం అధికమని ఎస్‌ఈ పేర్కొన్నారు. ఈ–స్టోర్ విధానంతో కావాల్సిన సామగ్రి తీసుకోవడం ద్వారా పనులు తొందరగా పూర్తి చేయడానికి క్షేత్రస్థాయిలో సమయం ఆదా అవుతుందని, పనులు వేగంగా జరుగుతున్నాయని ఎస్‌ఈ వివరించారు.
పెండింగ్ కేసులను
పరిష్కరించాలి
రామారెడ్డి: పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలి ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆదేశించారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆమె తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. ఎస్సై నరేష్ ఉన్నారు.
చదువుతోనే
మంచి భవిష్యత్తు
కామారెడ్డి టౌన్: చదువుతోనే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగ రాణి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాల సదన్‌ను ఆమె సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలను ఆరా తీశారు. చదువులో రాణించి ఉన్నత శిఖరాల ను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. వంటగది, స్టోర్ రూంలు తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్ పాకెట్‌లను అందజేశారు.
ఇంటర్‌లో ఉత్తమ
ఫలితాలు సాధించాలి
సదాశివనగర్: ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్ ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. బుధవారం సదాశివనగర్ ప్రభు త్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలంటే చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో చదువుకోవాలని సూచించారు. కాలేజీలకు రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. వారు తరగతులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. గతేడాది ఫలితాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.
నేడు మైనారిటీ
కమిషన్ చైర్మన్ రాక
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ గురువారం జిల్లా కేంద్రానికి రానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు జిల్లా అధికారులతో చైర్మన్ సమావేశం అవుతారని, మధ్యాహ్నం 2 గంటల వరకు మైనారిటీ వర్గాల వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.
నేటి నుంచి
పోలీస్ క్యూఆర్ కోడ్
ఖలీల్‌వాడి: ఫిర్యాదుదారులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారి స్పందనపై ఫీడ్ బ్యాక్‌ను సేకరించేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ గురువారం నుంచి అందుబాటులోకి వస్తుందని ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యూఆర్ కోడ్‌ను రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌లు, రద్దీ ప్రాంతాల్లో క్యూ ఆర్ కోడ్‌కు సంబంధించిన పోస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఫీడ్ బ్యాక్ అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment