తనయుడి జాడ కోసం వెళ్తే.. ఎదురొచ్చిన మృత్యువు
● రైలు ఢీకొని తండ్రి మృతి ● మెదక్ జిల్లా అక్కన్నపేటలో ఘటన
భిక్కనూరు: ఆత్మహత్య చేసుకుంటానని స్నేహితుడికి ఫొటోలు పంపిన కొడుకు ఆచూకీ కోసం వెళ్లిన తండ్రి రైలు ఢీకొని మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా అక్కన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుడు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. వివరాలు ఇలా ఉన్నాయి. భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన గంగయ్య గారి నర్సింలు (48) ఆయన కుమారుడైన రాజశేఖర్‌లకు వారి దాయాది అయిన గంగయ్యగారి స్వామితో మంగళవారం భూమి విషయమై గొడవ జరిగింది. ఈ విషయమై స్వామి భిక్కనూరు పోలీసులకు నర్సింలు, రాజశేఖర్‌లపై ఫిర్యాదు చేశాడు. తర్వాత అదే రోజు మధ్యాహ్నం నర్సింలు, కొడుకు రాజశేఖర్ మధ్య కూడా గొడవ జరిగింది. దీంతో నర్సింలు భిక్కనూరు పోలీస్ స్టేషన్‌లోతన కుమారుడిపై ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న రాజశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలని భావించి మెదక్ జిల్లా అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడ పట్టాలపై పడుకుని సెల్పీ దిగి తన మిత్రుడికి పంపించాడు. వెంటనే సదరు మిత్రుడు ఈ విషయాన్ని గ్రామస్తులకు, నర్సింలుకు తెలియజేశాడు. అప్రమత్తమైన గ్రామస్తులు, నర్సింలు, ఆయన భార్య సత్తవ్వలు పోలీసులకు సమాచారం అందించి అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. గ్రామస్తులు పోలీసులు ఒక్క వైపు, నర్సింలు ఆయన భార్య సత్తవ్వ మరో వైపు వెతకడం ప్రారంభించారు. పోలీసులకు గ్రామస్తులకు రాజశేఖర్ కనిపించగా ఆయనను పట్టుకున్నారు. ఇంకో వైపు వెతుకున్న నర్సింలును అదే సమయంలో వస్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తనయుని ఆచూకీ కోసం వెళ్లిన తండ్రి మృతి చెందడంతో భాగిర్తిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment