మహిళా సాధికారతే లక్ష్యం
కామారెడ్డి క్రైం: మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య నవంబర్ 19న ఒప్పందం కుదిరిందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్‌ల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలన్నారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా భూమిని సేకరించాలన్నారు. సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూ సేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం వంటి పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ, కలెక్టర్‌లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. మహిళలు వివిధ రకాల వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో స్మాల్, మైక్రో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నాలుగు నుంచి ఐదు ఎకరాలు భూమి అవసరం అవుతుందన్నారు. చిన్నపాటి ఇండస్ట్రియల్ ఏరియాల ఏర్పాటుకు అధికారులు భూములను సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటి వరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా ఆయా భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆ భూముల్లో ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంటల సాగును ప్రోత్సాహించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటు కోసం జిల్లా వ్యాప్తంగా 150 ఎకరాలు గుర్తించాలన్నారు. గ్రామాల్లో సబ్ స్టేషన్ లకు దగ్గరలో ఉన్న భూములు గుర్తించాలని సూచించారు. సబ్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల లోపల ఉన్న అటవీ, దేవాదాయ, ఇరిగేషన్, తదితర ప్రభుత్వ భూములను కూడా పరిశీలించాలని ఆదేశించారు. వీసీలో డీఎఫ్‌వో నిఖిత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రావణ్ కుమార్, డీఆర్‌డీవో సురేందర్ పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Comments
Please login to add a commentAdd a comment