![పూర్వవైభవం కోసం..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/110225_mr-1739217274-0.jpg.webp?itok=LGWqQNON)
పూర్వవైభవం కోసం..
బీసీ డిక్లరేషన్ అమలు కోసం బీఆర్‌ఎస్ పోరుబాట పడుతోంది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి గడ్డ మీదే భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ విషయమై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ప్రకటన గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అసెంబ్లీ ఎన్నికల్లో కామా రెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా అప్పటి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేటి సీఎం రేవంత్‌రెడ్డి పోటీ చేయడంతో కామారెడ్డి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు కామారెడ్డి మీదే దృష్టి సారించాయి. అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీల కోసం ఏం చేస్తామో ఆ డిక్లరేషన్‌లో వివరించారు. కామారెడ్డిలో ఉద్ధండులు పోటీ చేయడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. ఆ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఇద్దరు ఉద్ధండులను ఓడించి జెయింట్ కిల్లర్‌గా ఆవిర్భవించారు.
రంగంలోకి గులాబీ పార్టీ..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచాయి. ఇప్పటికీ బీసీ డిక్లరేషన్ విషయంలో ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి పట్టుపడుతున్నాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయాస్త్రంగా మలచుకోవాలని యోచిస్తోంది. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్న డిమాండ్‌తో పోరాటానికి సిద్ధమవుతోంది. వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో బీసీ చైతన్య సభలు నిర్వహించిన అనంతరం కామారెడ్డి సభ నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నారు. కులగణన సర్వే నివేదిక చిత్తు కాగితంతో సమానమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రీ సర్వే చేసి అసలైన లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డిలోనే సభ!
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా ‘బీసీ డిక్లరేషన్ సభ’ నిర్వహించింది. ఆ డిక్లరేషన్ అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అదే మైదానాన్ని వేదికగా చేసుకోవాలని బీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను గుర్తు చేస్తూ, ఆ పార్టీపై ఒత్తిడి తేవడానికి బీఆర్‌ఎస్ చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఏ రోజు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ నెలలోనే సభ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
బీసీ డిక్లరేషన్ అమలు కోసం
పోరుబాట
‘చలో కామారెడ్డి’కి కేటీఆర్ పిలుపు
భారీ సభ నిర్వహించే యోచనలో పార్టీ
ఈనెలలోనే సభ నిర్వహించే అవకాశం
రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, స్థానికంగానూ పార్టీ అభ్యర్థి ఓటమి పాలవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు నిస్తేజంలో ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మరింత కుంగదీశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ‘చలో కామారెడ్డి’ ప్రకటనతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా కామారెడ్డి నియోజక వర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం కనబడుతోంది. సభ నిర్వహిస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న ఆశతో వారు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కామారెడ్డిలో సభ జరిపితే పార్టీ ఊపులోకి వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment