క్రైమ్ వర్క్ చేస్తూ క్రిమినల్స్‌తో నెట్‌వర్క్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మేకల ఈశ్వర్ 2010లో కానిస్టేబుల్‌గా పోలీసు విభాగంలో అడుగుపెట్టాడు. ఎస్సార్‌నగర్, చిక్కడపల్లి, బేగంపేట పోలీసుస్టేషన్లతో పాటు టాస్క్‌ఫోర్స్‌లోనూ పని చేశాడు. మొదట్నుంచీ నేరాలకు సంబంధించిన విధులే నిర్వర్తించిన ఇతను.. అప్పట్లో చోరీ చేసిన ఫోన్లు ఖరీదు చేసే వాళ్లను బెదిరిస్తూ దందా మొదలెట్టాడు. తనకున్న పరిచయాలను వినియోగించుకుని చోరీకి గురైన ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు సేకరించేవాడు. వాటి ఆధారంగా అవి ప్రస్తుతం ఎవరు వాడుతున్నారో గుర్తించేవాడు. విషయం తెలియక సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో చోరీ ఫోన్లు కొనుగోలు చేసి వాడుతున్న వారిని పిలిచి బెదిరించేవాడు. ఫోన్ తీసుకోవడంతో పాటు కేసు పేరుతో భయపెట్టి కనీసం రూ.25 వేలు వసూలు చేసేవాడు. రికవరీ చేసిన ఫోన్‌ను అమ్ముకుని సొమ్ము చేసుకునే వాడు. ఇలా మొదలైన ఈశ్వర్ దందా పెద్ద నెట్‌వర్క్‌గా మారింది.
వసతులు, ‘జీతాలు’ ఇచ్చి నేరాలు
చోరీ ఫోన్ల మార్కెట్‌పై పట్టు లభించడంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న స్నాచర్లు, దొంగలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రాంతానికి చెందిన వారిని మరోచోటుకు పంపేవాడు. అక్కడ వారికి అద్దె ఇంటిలో వసతి కల్పించేవాడు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం నాలుగు ఫోన్లు కొట్టేయాలనే టార్గెట్ పెట్టేవాడు. వీటిలో ఒక ఫోన్‌ను విలువను లెక్కించి ఆ మొత్తాన్ని జీతం కింద వారికి ఇచ్చేవాడు. ఇక ఈ ఫోన్లను విక్రయించడానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోని వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. వీరినుంచి ప్రతినెలా మామూళ్లు కూడా వసూలు చేసేవాడని తెలిసింది. మరోవైపు సెల్‌ఫోన్లతో పాటు బంగారు నగలనూ స్నాచింగ్ చేయించేవాడు. 2022లో నల్లగొండ పోలీసులు ఈ తరహా ఓ కేసులో ఈశ్వర్‌ను అరెస్టు చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment