నాన్నా.. మాకు దిక్కెవరు..?
హుజూరాబాద్: కూతుళ్లకు అందమైన, అద్భుతమైన, భరోసా కలిగిన భవిష్యత్తును నిర్మించాలనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. పదేళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందగా.. ఇద్దరు కూతుళ్ల ఆలనాపాలన కోసం మరో పెళ్లి చేసుకోవాలని పలువురు చెప్పినా.. తను కూతుళ్లను సరిగా చేసుకుంటుందో లేదోనన్న భయంతో పెళ్లి చేసుకోలేదు. కూతుళ్ల భవిష్యత్తే తన భవిష్యత్తుగా భావించి కంటికి రెప్పలా కూతుళ్లను పెద్ద చేసి పట్టభద్రులను చేశాడు. పెద్ద కూతురి వివాహానికి అడుగులు పడుతున్న వేళ ఆ తండ్రిపై విధి పగబట్టి పొట్టనబెట్టుకున్న విషాద ఘటన హుజూరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. మూగజీవాల కోసం ఆహారం తెచ్చేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి చేరడం స్థానికులను కలిచివేసింది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. వకుళాభరణం రమేశ్(45) ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. రమేష్–రాధికకు విష్ణుత, పూజిత అనే ఇద్దరు కూతుళ్లున్నారు. పదేళ్ల క్రితం రాధిక అనారోగ్యంతో మృతిచెందగా.. కూతుళ్ల భవిష్యత్తు కోసం తండ్రి రమేశ్ కష్టపడి చదివించి పట్టుభద్రులను చేశాడు. ఈక్రమంలోనే ఇంట్లో పెంచుకుంటున్న కుందేళ్లకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మార్కెట్‌లో దెబ్బతిన్న కూరగాయలను ఆహారంగా తెచ్చేందుకు వెళ్లాడు. ఆహారం తీసుకొని ద్విచక్ర వాహనంపై సైదాపూర్ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్తుండగా.. కరీంనగర్ వైపు నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న ఓ కారు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం తండ్రి మృతదేహాన్ని చూస్తూ ఇద్దరు కూతుళ్లు నాన్నా.. మాకెవరు దిక్కంటూ బోరున విలపించడంతో స్థానికులు కంటతడి పెట్టారు. మరి కొద్ది రోజుల్లో పెద్ద కూతురు వివాహం చేసేందుకు పనులు చేపడుతున్న క్రమంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలచివేసింది. హన్మకొండ డీఎంహెచ్‌వో అప్పయ్య మృతదేహం వద్ద నివాళి అర్పించారు.
తండ్రి మృతితో
అనాథలైన ఇద్దరు కూతుళ్లు
మూగజీవాలకు ఆహారం తెచ్చేందుకు వెళ్తుండగా కారు ఢీ
Comments
Please login to add a commentAdd a comment