యోగా పోటీలు కరీంనగర్‌లో నిర్వహించాలి
కరీంనగర్ స్పోర్ట్స్: సీఎం కప్ టోర్నమెంట్‌లో భాగంగా రాష్ట్రస్థాయి యోగా పోటీలను కరీంనగర్‌లో నిర్వహించాలని తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం శాట్స్ ఎండీ సోనీ బాలాదేవికి వినతిపత్రం అందించారు. ప్రతిష్టాత్మక సీఎం కప్ టోర్నీలో యోగాకు అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా పోటీలను విజయవంతం చేస్తామన్నారు. ఇటీవలి జాతీయ యోగా పోటీల్లో తెలంగాణ క్రీడాకారుడు దీపక్ స్వర్ణ పతకం సాధించాడని ఎండీకి తెలిపారు.
జగ్గాసాగర్‌లో అగ్ని ప్రమాదం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): జగ్గాసాగర్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన సార అనూష శనివారం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది. అప్పటికే ఇంట్లో విద్యుత్ దీపాలు ఆన్ చేసి ఉండగా, మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొందరు స్థానికులు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు పలు ధ్రువపత్రాలు దగ్ధమయ్యాయి. ఆర్‌ఐ ఉమేశ్ ప్రమాదానికి గల కారణాలు, ఎంత నష్టం జరిగిందనే వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు అనూష కోరారు. కాగా షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment