రూ.21.80 లక్షల వసూలు కేసు
● భువనేశ్వర్‌లో నిందితుడి అరెస్టు
కరీంనగర్‌క్రైం: కస్టమ్స్ ఆఫీసర్ పేరిట ఓ మహిళ వద్ద నుంచి రూ.21.80 లక్షలు వసూలు చేసిన కేసులో ఒక నిందితుడిని కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు చెందిన సర్వేశ్వర్, సుధాన్ష్ శేఖర్ అన్నదమ్ములు. వీరు వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సర్వేశ్వర్ ఇటీవల కరీంనగర్‌లోని కమాన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేశాడు. తాను కస్టమ్స్ ఆఫీసర్‌నని, మీ పేరిట ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు పార్శిల్ వచ్చిందన్నాడు. అందులో చాలా రకాల బ్యాంక్ ఏటీఎం కార్డులు, డ్రగ్స్, పాస్‌పోర్టులు ఉన్నాయని చెప్పాడు. వెంటనే ఢిల్లీ పోలీసులను కాన్ఫరెన్స్‌లోకి తీసుకుంటానని, వారితో మాట్లాడాలన్నాడు. అందులో మరో వ్యక్తితో మాట్లాడించాడు. కేసు నమోదు చేసి, అరెస్టు చెస్తామని ఆమెను బెదిరించారు. కేసు లేకుండా చేయాలంటే తాము అడిగిన డబ్బులు ఇవ్వాలని చెప్పారు. వారి సూచన మేరకు బ్యాంక్ అకౌంట్‌కు పలు దఫాలుగా రూ.21.80 లక్షలు పంపించింది. తర్వాత ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులతో చెప్పగా.. అది మోసమని తెలిపారు. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఏసీపీ నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు ఒక నిందితుడు సుధాన్ష్ శేఖర్‌ను ఎస్సై వంశీకృష్ణ భువనేశ్వర్‌లో అరెస్టు చేశారు. విచారణలో తన అన్న సర్వేశ్వరే సూత్రధారి అని చెప్పాడు. సుధాన్ష్ శేఖర్‌ను కరీంనగర్‌కు తీసుకొచ్చి, జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై మన రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రల్లో కేసులున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా సైబర్ క్రైం పోలీసులను ఏసీపీ నర్సింహారెడ్డి శనివారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment