యాసంగి సాగుకు శ్రీకారం
● ప్రణాళిక ఖరారు చేసిన
వ్యవసాయాధికారులు
● 13,552 ఎకరాల్లో పంటల సాగు
కరీంనగర్‌రూరల్: వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్న రైతులు యాసంగి పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ధాన్యం అమ్మకాలను పూర్తి చేసిన కొందరు రైతులు పశుగ్రాసం నిల్వ చేయడం, పొలాల్లో గట్లను సరిచేయడం, దుక్కులు దున్నడం తదితర పనులు చేపడుతున్నారు. మరికొందరు రైతులు వరినార్లు పోయడంతో పాటు ఆరుతడి పంటలను సాగు చేశారు. దీంతో వ్యవసాయాధికారులు పంటల సాగు ప్రణాళిక రూపొందించారు.
13వేల ఎకరాల్లో పంటల సాగు
కరీంనగర్ మండలంలో పంటల సాగుకు అనువుగా 16,192 ఎకరాల విస్తీర్ణం ఉంది. వానాకాలం సీజన్‌లో 13,552 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన పంటగా వరి 12,623 ఎకరాలు, ఆరుతడి పంటలైన మొక్క జొన్న 929, వేరుశనగ 10, పెసర 24, మినుములు 2, ఇతర అపరాల పంటలు 39 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తుండటంతో సన్నరకం వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధం
యాసంగి సీజన్‌కు సరిపడా విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వరి 3,600 క్వింటాళ్లు, మొక్కజొన్న 68, కంది 6, పెసర 2, బబ్బెర్లు 4 క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆయా పంటలకు అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. పంటల సాగులో ఉపయోగించే యూరియా 924 మెట్రిక్‌టన్నులు, డీఏపీ 678, ఎంవోపీ 339, కాంప్లెక్స్ 1,016 ఎరువులను వినియోగిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్, దుర్శేడ్ సొసైటీలు, డీసీఎంఎస్‌తో పాటు ప్రైవేట్ దుకాణాల్లో ఎరువులను అందుబాటులో ఉంచనున్నారు.
వరికొయ్యలు కాల్చవద్దు
వానాకాలంలో వరికోతలు పూర్తి చేసిన రైతులు వరికొయ్యలను కాల్చితే కాలుష్యంతో పాటు భూ సారం తగ్గుతుంది. ఎకరానికి 10కిలోల సూపర్ ఫాస్పేట్‌ను చల్లి కలియ దున్నుకోవాలి. విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు రైతుల తప్పనిసరిగా దుకాణాల నుంచి రశీదులు తీసుకోవాలి. తెగుళ్లు ఆశించకుండా ముందస్తుగా వరి విత్తనాలకు బావిస్టన్ పౌడర్‌ను కలపాలి. మొగిపురుగు సోకకుండా నాట్లు వేసే ముందు కిలో కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్‌ను ఎకరానికి సరిపడే నారుమడిలో చల్లుకోవాలి.
బి.సత్యం, మండల వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment