అంతర్గాం భూముల్లో విమానాశ్రయం..!
● ఇటీవల పార్లమెంట్‌లో తెరపైకి అంశం
● మండల పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు
● విమానాశ్రయమైనా కార్యరూపం దాల్చేనా..?
రామగుండం: పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టేందుకు పలుసార్లు క్షేత్రస్థాయిలో అధికారులు భూమిని పరిశీలించారు. కాగా, కొన్ని సాంకేతిక కారణాలతో ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన స్థలం కాదని ఏయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్‌లో పౌర విమానయానశాఖ మంత్రి ఎర్రం రామ్మోహన్‌నాయుడు చర్చ లేవనెత్తినపుడు బసంత్‌నగర్‌కు బదులుగా అంతర్గాం మండల కేంద్రంలోని టెక్స్‌టైల్ భూముల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నిర్ణయిస్తూ వివరాలు సమర్పించారు. స్థానికంగా రైల్వే, రోడ్డు కనెక్టివిటీతో పాటు వివిధ పరిశ్రమలకు నిలయంగా ఉన్న రామగుండంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజల నివాస సమాహారంగా ఉండడం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో స్థానికంగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఢిల్లీలో కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతిపత్రం అందజేశారు.
టెక్స్‌టైల్ భూముల వివరాలు
1964 జూన్ 20న అంతర్గాం మండల కేంద్రంలో స్థాపించిన స్పిన్నింగ్, వీవింగ్ మిల్లులకు బర్మా, శ్రీలంక శరణార్థులతో పాటు స్థానిక కార్మికులతో కలిపి సుమారు 1,000 మందికి ఉపాధి కల్పించారు. బర్మా, కాందీశీకులకు సొసైటీ ఏర్పాటు చేసి ఒక్కో కార్మికుడికి రూ.4,100 బ్యాంకు రుణం అందజేసి, ఒక్కో క్వార్టర్ పది గుంటలు మొత్తం 502.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించి అప్పగించారు. ఇందులో నివాసంతో పాటు పెరటి తోటలు సాగు చేసుకోవాలనే ఉద్దేశంతో సదరు స్థలాన్ని కేటాయించారు. దశాబ్దకాలం తిరిగేలోగా నష్టాల బారిన పడడంతో లాకౌట్ చేశారు.
వేలాది ఎకరాలు నిరుపయోగం
రామగుండం మండల కేంద్రంలో మూడు దశాబ్దాల క్రితమే ప్రతిపాదిత 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపనకు బ్రిటిష్ ఫిజికల్ ల్యాబోరేటరీ (బీపీఎల్) శ్రీకారం చుట్టి ప్రహరీ, ఇతరత్రా పనులు చేపట్టినా సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఇందుకోసం ప్రభుత్వం బీపీఎల్‌కు కేటాయించిన భూమి 543.05 ఎకరాలు, రైతుల నుంచి నామమాత్రపు ధరకు సేకరించిన భూమి 1,271.38 ఎకరాలు మొత్తం బీపీఎల్ వద్ద 1,817.03 ఎకరాలు నిరుపయోగంగా ఉంది. అంతర్గాం మండల పరిధిలోని రాయదండి, ఎగ్లాస్‌పూర్, విసంపేట, పొట్యాల, ఆకెనపల్లి, సోమనపల్లి, మద్ధిర్యాల శివారుల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకోరల్లో చిక్కుకుంటున్నాయి. పట్టణంలోని బీ–థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రస్తుతం నిరూపయోగంగా ఉంది.
ఎన్నెన్నో హామీలు
వందలాది ఎకరాలు నిరూపయోగంగా ఉన్న అంతర్గాం టెక్స్‌టైల్ భూముల్లో ఎన్నో పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చకపోగా ఆదిలోనే ఆవిరయ్యాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తుంటాయి. 30 ఏళ్ల క్రితమే బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ముందు ఇక్కడే విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత మహిళా పాలిటెక్నిక్, పోలీసు బెటాలియన్, ముర్రా జాతి గేదెల పరిశోధన కేంద్రం, మేకల పరిశోధన కేంద్రం, మూడేళ్ల క్రితం ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్ ఇవన్నీ సర్వేలు, ప్రతిపాదనల్లోనే సమసిపోగా రెండురోజుల క్రితం విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనలు రావడం మళ్లీ చర్చకు దారితీశాయి.
పరిశ్రమలు స్థాపిస్తాం
అంతర్గాం టెక్స్‌టైల్ భూముల్లో విమానాశ్రయం ఏర్పా టు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఇప్పటి కే ఎంపీ దృష్టికి తీసుకెళ్లాను. రామగుండంలో కొత్త విద్యు త్ కేంద్రం స్థాపన, అంతర్గాంలో విమానాశ్రయం ఏర్పాటు, బీపీఎల్ భూముల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదా ఇతరత్రా పరిశ్రమలు స్థాపించేందుకు సదరు సంస్థపై ఒత్తిడి తీసుకువస్తున్న. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగావకాశాలు కల్పించడమే నా లక్ష్యం.
– మక్కాన్‌సింగ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం
Comments
Please login to add a commentAdd a comment