రైతుల సంక్షేమమే ధ్యేయం
● మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన సాగిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సైదాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. జనవరి 1న కరీంనగర్ మానేర్ డ్యాం నుంచి యాసంగిసాగుకు నీటివిడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రైతులు సాగునీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ సప్లమెంట్ల ద్వారా మొత్తం 29 టీఎంసీలు యాసంగి మూడు నెలలకు గానూ విడుదల చేయనున్నట్లు వివరించారు. సంక్రాంతి కానుకగా రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు. ఇండ్ల మంజూరులో ఎలాంటి ఫైరవీలు ఉండవన్నారు. ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గుట్టలను పర్యాటకంగా తీర్చిదిద్దే పనులకు టెండర్లు పూర్తి అయ్యాయని, వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాయికల్ జలపాతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సీనియర్ నాయకుడు గుండారపు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మ్యాకల రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి కిష్టయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment