ప్రయోగం లేదు!
● ఇంటర్ కళాశాలలకు ఐదేళ్లుగా నిధులివ్వని ప్రభుత్వం ● చాలా కాలేజీల్లో ల్యాబ్స్ లేవు ● ఉన్నా.. సౌకర్యాలు, పరికరాల్లేవు ● వచ్చే నెల 3 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ● ప్రారంభం కాని తరగతులు
ఇతర దేశాల్లో పాఠశాల దశ నుంచే ప్రారంభమవుతున్న ప్రయోగ తరగతులు మన దగ్గర ఇంటర్మీడియట్ స్థాయికి చేరుకున్నా సరిగా కొనసాగడం లేదు. తగిన సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం విద్యార్థులు కీలక ప్రయోగాలు చేయాల్సి ఉన్నా ల్యాబ్‌ల నిర్వహణ లోపం కారణంగా ప్రయోగ విద్య సరిగా అందడం లేదు. వచ్చేనెల 3 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టైమ్ టేబుల్ విడుదల చేసింది. మరో 25 రోజుల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి.. అయినా ఇంత వరకు జిల్లాలో ఇంకా తరగతులు ప్రారంభం కాలేదు.
కరీంనగర్●:
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్, 57 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 11 ఆదర్శ పాఠశాలలు, 5 కస్తూరిబా విద్యాలయాలు, 10 ప్రైవేట్ ఒకేషనల్, 3 మైనార్టీ కళాశాలలు, 4 సోషల్ వెల్ఫేర్, 1 బీసీ వెల్ఫేర్, 1 ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలున్నాయి. మొత్తం 103 కళాశాలల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,559 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,532 మంది ఉన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 1,834 మంది, బైపీసీలో 1,989 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారు. సైన్స్ విద్యార్థుల ప్రయోగాల కోసం ఐదేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దీంతో ప్రయోగశాలల నిర్వహణ గాడి తప్పినట్లయింది. గతంలో ఒక్కో విద్యార్థికి రూ.120 చొప్పున అందించేవారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో సరైన వసతులు, ల్యాబ్‌కు ప్రత్యేకంగా గదుల్లేవు. ఉన్న కొన్ని పరికరాలు మూలన పడుతున్నాయి.
పలు ప్రైవేట్ కాలేజీల్లో మరీ అధ్వానం..
జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో ప్రయోగశాలలు లేవు. యాజమాన్యాలు సిలబస్ పూర్తి చేయించడానికే ప్రాధాన్యం ఇస్తూ ప్రయోగాల జోలికి వెళ్లడం లేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. ల్యాబ్‌లున్న కాలేజీల్లో సౌకర్యాలు లేవు. కేవలం అబ్జర్వేషన్ రాయించి, దాన్నే బట్టీ పట్టించి, పరీక్షలు రాయిస్తున్నారు. ప్రయోగ పరీక్షల నాటికి విద్యార్థులు ఇంటి వద్దే ఉంటారు కాబట్టి, ల్యాబ్‌లు లేని కాలేజీల్లో వారి తరగతి గదులకు ప్రయోగశాల అని స్టిక్కర్ అంటిస్తున్నారు. ఉన్న కొన్ని పరికరాలను పరీక్షల సమయంలో చూపెడుతున్నారు. ఇంకొన్ని కళాశాలలైతే ప్రయోగాల వైపు వెళ్లడమే లేదు. పరీక్షల సమయంలో ఎగ్జామినర్ల సహాయంతో మార్కులు వేయించుకొని, విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
పాఠంతోపాటే నేర్పించాలి..
ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల ప్రయోగాలను పాఠంతోపాటే నేర్పించాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొన్నింటికి మాత్రమే అనువైన స్థలా లుండి, ప్రయోగశాలలు నడుస్తున్నాయి. మిగతా చోట్ల ల్యాబ్‌లు ఉన్నప్పటికీ వసతులు లేకపోవడంతో పరికరాలన్నీ బీరువాలకే పరిమితమవుతున్నాయి.
ప్రయోగాలు జరిపేలా చర్యలు
అన్ని కళాశాలల్లో ప్రయోగాలు జరిపించేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని ల్యాబ్‌లను పర్యవేక్షిస్తాం. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూస్తాం. ప్రయోగ పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు, ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నాం. ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇంటర్ బోర్డు ఒక్కో కళాశాలకు రూ.25 వేల చొప్పున అందిస్తుంది. ఆ డబ్బులను త్వరలోనే కళాశాలలకు ఇస్తాం. ప్రత్యేక నిధులు లేని కారణంగా లెక్చరర్లు ప్రయోగాలకు కావాల్సిన సామగ్రి సమకూర్చుకోలేకపోతున్నారు. – జగన్మోహన్‌రెడ్డి, డీఐఈవో
Comments
Please login to add a commentAdd a comment