సాక్షి : వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది?
డీఎంహెచ్‌వో : కరోనా మహమ్మారితో ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోవిడ్ మాదిరిగానే చైనాలోనే పుట్టిన ఈ హెచ్‌ఎంపీవీపై జరుగుతున్న దుష్ప్రచారంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఇది సాధారణ వైరస్సే. ఎలాంటి ప్రాణాపాయం లేదు.
సాక్షి : శ్వాసకు సంబంధించి ఇబ్బందులొస్తాయా?
డీఎంహెచ్‌వో : కరోనా వైరస్ తరహాలోనే హెచ్‌ఎంపీవీ కూడా ఆర్‌ఎన్‌ఏ రకం వైరస్. అందుకే జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు తదితర లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ ప్రధానంగా మనం శ్వాస తీసుకునే మార్గంలోనే వృద్ధి చెందుతుంది. నోటి, తుమ్ముల నుంచి వెలువడే తుంపరల ద్వారా వ్వాపిస్తుంది. అయితే, ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే కొన్ని రోజుల చికిత్సతో తగ్గిపోయే అవకాశం ఉంది.
సాక్షి : జిల్లాలో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయా?
డీఎంహెచ్‌వో : ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఒకవేళ నమోదైనా దాని ప్రభావం పెద్దగా ఉండదు. రెగ్యులర్ వైద్యం సరిపోతుంది. రెండు, మూడు రోజుల్లోనే నయమవుతుంది.
సాక్షి : వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో : వైరస్ సోకిన వ్యక్తి కరోనా నిబంధనల మాదిరిగానే మాస్కు ధరించి, మూడు, నాలుగు రోజులపాటు ఇతరులకు దూరంగా ఉంటే మంచిది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరుమాలు అడ్డుగా పెట్టుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. వైరస్ సోకిన వ్యక్తికి సపర్యలు చేసినా ఏమీ కాదు.
సాక్షి : ఎవరిపై ఎక్కువ
ప్రభావం ఉంటుంది?
డీఎంహెచ్‌వో : ఈ వైరస్‌ను 2001లోనే గుర్తించారు. అప్పటినుంచి ఇది చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధుల్లో సీజనల్ వ్యాధిలాగే కొనసాగుతోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులకు మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. శ్వాస సంబంధ ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చైనాలో వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉందని తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది.
సాక్షి : వైద్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఎంహెచ్‌వో : జిల్లాలో వైరస్ ప్రభావం ఏ మాత్రం లేనప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆస్పత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. అవసరమైన మందులు సమకూర్చుతున్నాం. ఫ్లూ లక్షణాలతో వచ్చిన ప్రతీ ఒక్కరికి వైద్య పరీక్షలు చేయాలని టెక్నీషియన్ సిబ్బందిని ఆదేశించాం. వైరస్ లక్షణాలు, నివారణ, జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment