రాని పూత.. రైతన్న వెత
● మూడేళ్లుగా సరైన దిగుబడినివ్వని మామిడి తోటలు ● నవంబర్ నుంచే పూత మొదలవ్వాలి ● ఈసారీ చెట్లపై కనిపించడం లేదు
జగిత్యాల అగ్రికల్చర్: ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు మామిడి పంటకు ప్రతిబంధకంగా మారాయి. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో రావాల్సిన మామిడి పూత ఇప్పటికీ కనిపించడం లేదు. అక్కడక్కడ వచ్చిన పూతను తేనె మంచు పు రుగు ఆశిస్తోంది. రెండు, మూడేళ్లుగా మామిడి పంట దిగుబడి సరిగా రావడం లేదు.
జగిత్యాల జిల్లాలోనే 35 వేల ఎకరాల్లో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 80 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 35 వేల ఎకరాల్లో విస్తరించాయి. సగటున ఎకరాకు 5 టన్నుల చొప్పున 4 లక్షల మె.ట. మామిడి దిగుబడి వస్తుందని అంచనా. అయితే, మామిడి సీజన్‌లో ధర సైతం టన్నుకు తక్కువలో తక్కువ రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతుంది. వరి, మొక్కజొన్నకు పెట్టుబడులు పెరిగిపోవడం, కూలీలు దొరక్కపోవడంతో రైతులు మామి డి తోటలు పెంచుతున్నారు. జగిత్యాల, కరీంనగర్‌లలో మార్కెట్లు ఉండటం, ప్రధాన రోడ్ల వెంట మామిడిని ఎక్కడికక్కడే కొనుగోలు చేస్తుండటం కూడా ఇందుకు కారణం. వ్యాపారులు నేరుగా ఢిల్లీ, నాగ్‌పూర్ వంటి నగరాలకు తరలిస్తుండటంతో మామిడికి మంచి రేటు వస్తుందని ఆశపడ్డారు.
పొడి వాతావరణం ఉండాలి..
గత కొన్ని నెలలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలతోపాటు తేమశాతం పెరగడం, చలి ప్రభావంతో మామిడి పూ మొగ్గలు బిగుసుకుపోయి, సరిగా విచ్చుకోవడం లేదు. రాత్రివేళల్లో కురిసే మంచు కూడా పూతపై ప్రభావం చూపుతోంది. పూత నుంచి పిందె వచ్చే వరకు పొడి వాతావరణం ఉండాలి. ఆ పరిస్థితులు కనిపించడం లేదు.
వర్షాలతో ఇబ్బందులు..
మామిడి చెట్లు పూతకు రావాలంటే బెట్ట పరిస్థితులు ఉండాలి. కానీ, గతేడాది సెప్టెంబర్ వరకు అధిక వర్షాలు కురిశాయి. భూమంతా తేమతో ఉంది. ఏటా కాయలు తెంపగానే, వర్షాకాలంలో చెట్లను ప్రూనింగ్(కొమ్మల కటింగ్) చేయిస్తే కొత్తగా వచ్చే కొమ్మలకు పూత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనవరి నెల సగానికి వచ్చినా పూత రాకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆశిస్తున్న తేనె మంచు పురుగు
మూడేళ్లుగా మామిడి పూత రాకపోవడం, వచ్చినా నిలవకపోవడం, తేనెమంచు పురుగు ఆశిస్తుండటంతో అనుకున్న దిగుబడి రావడం లేదు. దీంతో, కొంతమంది రైతులు ఇప్పటికే తోటలను తొలిగించగా, మరికొందరు ఈ ఏడాది పంట దిగుబడిని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. రసాయన ముందులు పిచికారీ చేయిస్తున్నా, అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నా పూత రావడంలేదు. వచ్చినా నిలవడం కష్టమవుతోంది.
ఎకరాకు రూ.20 వేలు ఖర్చు పెట్టా
మా మామిడి తోటలో ఇప్పటికే ఎకరాకు రూ.20 వేలు ఖర్చు పెట్టి, అన్ని యాజమాన్య పద్ధతులు పాటించాను. పురుగు మందులు పిచికారీ చేయించాను. గత మూడేళ్లలో పూత లేదు. ఈసారి ఏం చేస్తుందో చూడాలి.
– కాటిపెల్లి శ్రీపాల్ రెడ్డి,
వెంకట్రావుపేట, మేడిపల్లి మండలం
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
తేమ వాతావరణం ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం మామిడి పూతపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడక్కడ వచ్చిన పూతను తేనె మంచు పురుగు ఆశించినందున రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
– పి.అరుణ్‌కుమార్, హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment