జమ్మికుంట: ప్రైవేటు చిట్టీలు నడుపుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. మండలంలోని పాపయ్యపల్లి గ్రామానికి చెందిన రాపెల్లి కుమారస్వామి పట్టణానికి చెందిన మేకల శ్యామ్ సుందర్‌రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద 2022 నుంచి రూ.5లక్షల చిట్టి వేశాడు. నెలకు రూ.15వేల చొప్పన ఫోన్‌పే ద్వారా 25 నెలలు డబ్బులు చెల్లించాడు. చిట్టి డబ్బులు ఇవ్వాలని అడగ్గా.. చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి అరెస్టు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన వివాహితను లైంగికంగా వేధిస్తున్న కత్తెరపాక దిలీప్‌ను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు పంపినట్లు ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన దిలీప్, అనంతగిరిక చెందిన వివాహితను వెంబడిస్తూ లైంగికంగా వేధించేవాడు. బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై తెలిపారు. నిందితునిపై బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే రెండు కేసులు ఉన్నట్టు ఎస్సై తెలిపారు.
దాడి సంఘటనలో
ఇద్దరి రిమాండ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని బండలింగంపల్లి శివారులోని వ్యవసాయ భూముల విషయంలో ఆదివారం ముగ్గురిపై దాడిచేసిన సంఘటనలో ఇద్దరిని పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. భూవివాదంలో గడ్డం పుష్పలతతోపాటు ఆమె ఇద్దరు కుమారులు కరుణాకర్, జగన్‌లపై దాడిచేసిన శ్రీనివాస్, నరేశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
సెల్‌ఫోన్ దొంగిలించి డబ్బులు డ్రా
మెట్‌పల్లి: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి చెందిన గాండ్ల బాశెట్టి రణదీశ్ బ్యాంక్ ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ నెల 15న రణదీశ్ మెట్‌పల్లి నుంచి ఆర్మూర్‌కు బస్సులో వెళ్తుండగా సెల్‌ఫోన్ అపహరణకు గురైంది. అందులోని ఫోన్ పే నుంచి రూ.1.57లక్షలను వివిధ ఖాతాల్లోకి మళ్లించారు. దీంతో బాధితుడు ముందుగా సైబర్ క్రైం, తర్వాత మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని గంజి రోడ్డు ప్రాంతానికి చెందిన ఉమేయ తహేర్ (14) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తహేర్ తొమ్మిదో తరగతి చదువుతోంది. నిత్యం సెల్‌ఫోన్ చూస్తూ ఉండడంతో మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదు చేసి గాలిస్తుండగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి ఆదివారం తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం తల్లిదండ్రులు కోరుట్లలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లో ఉరేసుకుంది. తల్లిదండ్రులు వచ్చేసరికి మృతిచెందింది. బాలిక మృతికి నువ్వంటే నువ్వే కారణమని తల్లిదండ్రులు ఆస్పత్రిలో గొడవకు దిగారు. పట్టణ ఎస్సై కిరణ్ ఆస్పత్రికి చేరుకుని వారి సముదాయించారు. కుటుంబ సభ్యులతో ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment