నా తండ్రిని సాదండి సారూ..
● నిస్సహాయ స్థితిలో కొడుకు మొర
● సిరిసిల్ల కలెక్టర్‌ను ఆశ్రయించిన నేతన్న
సిరిసిల్లటౌన్: కొందరి కష్టాలు చూస్తుంటే పగవారికి కూడా రావొద్దనిపిస్తుంటుంది. ఇటువంటి కష్టమే సిరిసిల్ల నేతన్నకు వచ్చింది. తాను నిస్సహాయ స్థితిలో ఉండగా సుమారు 90 ఏళ్ల వయస్సు ఉన్న తండ్రిని సాదలేనన్న బాధతో జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాను ఆశ్రయించన వైనం పలువురిని కంటతడి పెట్టించింది. బాధితుడు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణానికి చెందిన గోనె శేఖర్ నేతకార్మికుడి(గతంలో)గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొడుకులు ఎవరూ లేరు. భార్య బీడీలు చుట్టేది కానీ గుండెజబ్బు బారిన పడడంతో పనిమానేసింది. నాలుగేళ్లుగా తనకు కూడా కాళ్లు సరిగ్గా పనిచేయక ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపారు. తన తండ్రికి మతిస్థిమితం సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసారా పింఛన్ డబ్బులతోనే తనకు, తన భార్యకు మందులు వెల్లదీసుకుంటున్నట్లు తెలిపారు. మండేపల్లి శివారులోని కేసీఆర్‌నగర్‌లో ఉంటున్నామన్నారు. ఈక్రమంలోనే ఇంట్లో ఎవరికీ ఏ చికిత్స అవసరం పడ్డా చేయించుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. తన తండ్రిని సాదాలని ఉన్నా తన నిస్సహాయ స్థితిని తలుచుకుని రోదించారు. కలెక్టర్ దయతలచి తన తండ్రి రామస్వామిని వృద్ధాశ్రమంలో చేర్పించి, వైద్యం చేయించాలని కోరారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టి రామస్వామిని వృద్ధాశ్రమానికి తరలించే ఏర్పాట్లు చేశారు. గోనె శేఖర్ పరిస్థితిని చూసి ప్రజావాణికి వచ్చిన వారిని కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment