విద్యుదాఘాతానికి ఏనుగు బలి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి ఏనుగు బలి

Published Tue, May 7 2024 4:15 AM

విద్యుదాఘాతానికి ఏనుగు బలి

కెలమంగలం: ఆహారం కోసం గ్రామం వైపు వచ్చిన ఏనుగు విద్యుత్‌ తంతి తగిలి మృతి చెందింది. డెంకణికోట సమీపంలోని సందనపల్లి వద్ద ఉదయం ఏనుగు మృతి చెంది పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పశు వైద్యులతో అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కళేబరాన్ని పాతిపెట్టారు. మృతిపై విచారణ చేపట్టారు.

మద్యం కొనివ్వలేదని

కత్తితో దాడి

ఇద్దరికి తీవ్ర గాయాలు

క్రిష్ణగిరి: మద్యం కొనిపెట్టలేదని ఆగ్రహంతో ఇద్దరిపై కత్తితో దాడి చేసిన నిందితుడిని సూళగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. సూళగిరి తాలూకా అంగొండపల్లి గ్రామానికి చెందిన ప్రభాకరన్‌ (30), మిత్రుడి ఆరుపల్లి గ్రామానికి చెందిన సెల్వం(29) ఆదివారం సాయంత్రం కారుబల సమీపంలోని ప్రభుత్వ టాస్‌మార్క్‌ దుకాణం వద్ద మద్యం తాగుతుండగా అక్కడికి వచ్చిన పెద్దసిగర్లపల్లి గ్రామానికి చెందిన అమరీష్‌ (30) మద్యం కొనివ్వాలని ఒత్తిడి చేశాడు. వారు లేదని చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో ప్రభాకరన్‌, సెల్వంలపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని అమరీష్‌ను అరెస్ట్‌ చేశారు.

హత్య చేస్తానని జైలు నుంచి బెదిరింపులు

మైసూరు: హత్య కేసులో జైలులో ఉన్న వ్యక్తి సొంత అత్తను హత్య చేస్తానని బెదిరించిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు... రమ్మనహళ్లికి చెందిన కృష్ణ ఓ హత్య కేసులో జైలులో ఉంటున్నాడు. ఇతను తమ్మనహళ్లిలో ఉన్న దేవమ్మ అనే మహిళ కుమార్తె ఐశ్వర్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం కుటుంబంలో గొడవలు రావడంతో ఐశ్వర్య పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న కృష్ణ అత్త దేవమ్మకు ఫోన్‌ చేసి హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిరాలు మైసూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంటాడిన తాగుడు భూతం.. ముగ్గురు ఆత్మహత్య

హోసూరు: హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతాల్లో వివిధ కారణాలతో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకొన్నారు. హోసూరు తాలూకా పంక్షేశ్వరం సమీపంలోని మాదినాయకనపల్లి ప్రాంతానికి చెందిన మునిరాజ్‌ (59)కు తాగుడు అలవాటుండేది. దీంతో అనారోగ్యానికి గురైన ఇతను గత రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు, గమనించిన బంధువులు చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించాడు.

● హోసూరు ఎం.జి. రోడ్డు కాజల్‌బండ ప్రాంతానికి చెందిన సంతోష్‌ (30) గత కొద్ది సంవత్సరాల క్రితం ప్రమాదానికి గురైన ఇతను తాగుడుకు బానిసయ్యాడు. పేదరికం, మద్యపానంతో విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

● జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలోని పణందోపు ప్రాంతానికి చెందిన షణ్ముగం (38). కూలికార్మిడు. రోజూ మద్యం తాగి ఇంటికెళ్లడంతో భార్య గొడవపడేది. ఆదివారం రాత్రి గొడవ జరిగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలిక కిడ్నాప్‌– ఇద్దరి అరెస్ట్‌

కెలమంగలం: ఇంట్లో ఒంటరిగ ఉన్న బాలికను కిడ్నాప్‌ చేసిన ఇద్దరిని డెంకణీకోట మహిళా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు... అంచెట్టి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు డెంకణీకోట మహిళా పోలీసులకు ఫిరాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలికను కిడ్నాప్‌ చేసిన మావనట్టి గ్రామానికి చెందిన శ్యామరాజ్‌ (24), అతనికి సహకరించిన మార్కండేయన్‌లను అరెస్ట్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement