జూద భూతాన్ని తరిమేయాలి
మండ్య: జిల్లాలో పెచ్చుమీరుతున్న అక్రమ జూద అడ్డాలు, క్రికెట్ బెట్టింగ్, హుక్కా సెంటర్లను అరికట్టాలని కరునాడ సేవకులు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వీటి వల్ల అనేకమంది యువత, కుటుంబాలు నాశనమవుతున్నాయని, నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీకి, జిల్లాధికారికి వినతిపత్రాలు సమర్పించారు. బెట్టింగ్ దందాకోరులు, జూదరులను రాబోయే 15 రోజుల్లో అదుపు చేయాలని, లేకుంటే జిల్లాలోని వివిధ సంఘాలతో కలిసి నిరవధిక ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఎంబీ నాగనగౌడ, సతీష్, టీఎల్ కృష్ణేగౌడ, కుమారి, చంద్ర పాల్గొన్నారు.
మైసూరులో
సామూహిక అత్యాచారం
మైసూరు: స్నేహితులే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాచ నగరంలో జరిగింది. బాధిత యువతి విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం కొడగు జిల్లా మడికెరి నుంచి స్నేహితులతో కలిసి వచ్చి నగరంలోని హోటల్‌లో బస చేసింది. టూర్ కోసం వారందరూ వచ్చారు. ఆ సమయంలో వెంట ఉన్న పురుష స్నేహితులు తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం నగర శివార్లలో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఇంతలో మరో దారుణం కలకలం రేపింది.
ఆస్పత్రులకు పటాకుల
బాధితుల క్యూ
బనశంకరి: దీపావళి టపాసుల బాధితులు నగరంలో ఆస్పత్రికి క్యూ కడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 170 మందికి పైగా కంటికి గాయాలు కాగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురు దృష్టి కోల్పోయే ప్రమాదం నెలకొంది. చాలామందికి కళ్లకు శస్త్రచికిత్సలు చేశారు. మింటో ఆసుపత్రిలో 55 మందికి చికిత్స తీసుకున్నారు. ఇందులో 32 మంది పిల్లలకు కంటికి గాయాలయ్యాయి. 26 మంది తీవ్రంగా గాయపడగా 29 మందికి స్వల్పంగా గాయపడ్డారు.
పొలంలో కొండచిలువ
గౌరిబిదనూరు: తాలూకా గోట్లగుంటె సమీపంలోని పొలంలో పెద్ద కొండ చిలువను అటవీ అధికారి యల్లప్ప పట్టి రక్షించారు. ఈ కొండ చిలువ సుమారు 8 అడుగుల పైగా పొడవు ఉంది. పొలంలో తిరుగుతుండగా రైతులు చూసి అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీనిని పట్టుకుని గుడిబండ అడవులలో వదిలినట్లు యల్లప్ప తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment