బెంగళూరు కిటకిట
బస్సు, రైల్వే స్టేషన్లలో
జనసందడి
కొందరు తమ తమ స్వంత వాహనాల్లో ఊళ్లకు, టూర్లకు వెళ్లారు. మరికొందరు కేఎస్‌ఆర్‌టీసీ, ప్రైవేట్ బస్సులు, రైళ్లల్లో తరలగా, ఒకే సమయానికి వెనుదిరిగారు. దీంతో బెంగళూరులో ఏదో జాతర మహోత్సవానికి వచ్చినట్లు అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జనసందడి నెలకొన్నది. జిల్లాల నుంచి బెంగళూరుకు వచ్చే బస్సుల కోసం పోటాపోటీ నెలకొంది. జిల్లా, తాలూకా బస్టాండ్లలో ఇవే దృశ్యాలు కనిపించాయి. సీటు లేకపోయినా పర్వాలేదు, నిలబడడానికి స్థలం దొరికితే చాలన్నట్లు కిటికీల లో నుంచి బస్సుల్లోకి తీసుకొచ్చారు. బస్సుల్లో టికెట్లు రిజర్వేషన్ టికెట్ చేసుకొన్నవారు కూడా సీట్ల కోసం గొడవలకు దిగాల్సి వచ్చింది. రైళ్లలో కూడా ఏ బోగీలు కూడా ఖాళీ లేకుండా ప్రయాణికులు నిండిపోయారు. ఎలాగో సాహసించి సిటీలోకి ప్రవేశించిన ప్రజలు ఇళ్లకు చేరేందుకు మరిన్ని అవస్థలు పడ్డారు. చిక్కమగళూరు, హాసన్, తుమకూరు, దావణగెరతో పాటుగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు మెజిస్టిక్‌లో బస్సు దిగి తమ తమ ఇళ్లకు తరిలేందుకు బీఎంటీసీ బస్టాండ్‌కు పరుగులు తీశారు. చివరకు ఉరుకుల పరుగుల నగర జీవితంలో తిరిగి మమేకయ్యారు. బోసిపోయిన కూడళ్లు, బస్టాపులలో విధులకు వెళ్లే జనంతో కిటకిట ఏర్పడింది.
శివాజీనగర: భూమి గుండ్రంగా ఉన్నట్లే.. ఐటీ సిటీ నుంచి ఎంత దూరం వెళ్లినా తిరిగి రావాల్సిందే. వరుస సెలవులు ముగించుకొని రాజధానికి వెనుతిరిగి వచ్చిన లక్షలాది మంది నగరవాసులకు ట్రాఫిక్ జామ్ స్వాగతం పలికింది. దీపావళి, కన్నడ రాజ్యోత్సవం, వీకెండ్ వల్ల నాలుగు రోజులు వరుసగా సెలవులు రావటంతో నగర ప్రజలు తమ తమ గ్రామాలు, పర్యాటక క్షేత్రాలకు తరలి ఎంజాయ్ చేసుకొని ఆదివారం అర్ధరాత్రి నుంచి నగరానికి చేరుకోసాగారు. అంతే.. సిటీకి దారితీసే అన్ని ప్రధాన రహదారులు కార్లతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యమైన తుమకూరు రోడ్డు సంగతి చెప్పనలవి కాదు. నెలమంగల నుంచి ప్రారంభమైన ట్రాఫిక్ జాం ఎనిమిదో మైలు, జాలహళ్ళి క్రాస్, దాసరహళ్ళి, గొరగుంటపాళ్య, యశ్వంతపురలో విపరీతంగా తయారైంది. గంటలకొద్దీ రోడ్లపై వేచి ఉన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. మైసూరు రోడ్డులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మైసూరు, కొడుగు, ఊటీ వైపు వెళ్లినవారు తిరిగి వస్తుండగా, ఎక్స్‌ప్రెస్ వేలో బిడది నుంచి విపరీత రద్దీ కార్లకు బ్రేకులు వేసింది.
మెట్రో స్టేషన్లు కిటకిట
పండుగకు ఊరెళ్లిన బెంగళూరువాసులు ప్రజలంతా సోమవారం నుంచి మళ్లీ పనుల్లో నిమగ్నమయ్యారు. రోడ్లు ట్రాఫిక్‌తో నిండిపోవడంతో మెట్రో రైళ్లలో అయితే త్వరగా చేరుకోవచ్చని భావించి, తరలిరావడంతో స్టేషన్‌లలో జనసందడి కనిపించింది. తమకూరు రోడ్డులో వచ్చే నాగసంద్ర మెట్రో స్టేషన్‌లో బయటికి వచ్చేవారు అర్ధ కిలోమీటర్ వరకు క్యూలో నిలిచారని తెలిసింది. మెట్రోస్టేషన్‌లో మాత్రమే కాకుండా బయట రోడ్డు పొడవునా ప్రయాణికులు బారులుతీరి నిల్చున్నారు. మెట్రో గ్రీన్ మార్గంలో మిగతా మూడు మెట్రో స్టేషన్‌ల ప్రారంభం పెండింగ్‌లో ఉంది. వీటిని త్వరగా అందుబాటులోకి తేవాలనే డిమాండ్లు ఉన్నాయి.
4 రోజుల వరుస సెలవులు
ఊళ్లకు వెళ్లినవారు తిరిగిరాక
రహదారులన్నీ కార్లమయం
Comments
Please login to add a commentAdd a comment