ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం
● కేంద్రమంత్రి కుమారస్వామి
దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. చెన్నపట్టణ తాలూకా గొల్లరదొడ్డి గ్రామంలో ఎన్‌డీఏ అభ్యర్థి నిఖిల్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ఈ యుద్ధంలో నిఖిల్ గెలిచి ధర్మాన్ని గెలిపిస్తాడన్నారు. గతంలో రామనగర, మండ్యలో ఓటమిపాలైన అభిమన్యుడు కాదని, ఇప్పుడు అర్జునుడని చెప్పుకొచ్చారు. చెన్నపట్టణ ఎన్నికలు రాష్ట్రంలో రాబోవు రోజుల్లో రాజకీయ దిక్సూచిగా మారనున్నాయన్నారు. ముందుముందు జరగబోయే రాజకీయ మార్పులకు ఈ ఎన్నికల ఫలితాలు ప్రారంభం అన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. నిఖిల్‌ను గతంలో రామనగర, మండ్యలో కుట్ర చేసి ఓడించారన్నారు. అయితే బీజేపీ కృష్ణుని పాత్ర పోషించి నిఖిల్‌ను అర్జునుడిలా గెలిపిస్తారన్నారు.
వృద్ధురాలి డిజిటల్ అరెస్టు
● రూ.10.21 లక్షలు వసూలు
● బెంగళూరులో సైబర్ నేరం
బనశంకరి: డిజిటల్ అరెస్ట్‌కు భయపడిన వృద్ధురాలు రూ.10.21 లక్షలు పోగొట్టుకుంది. నగరంలో కన్నింగ్‌హ్యామ్ రోడ్డు జీపీఓలో స్థిరపడిన మహిళకు గత నెల 25వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి ఓడాఫోన్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి, మీరు నేరాలకు పాల్పడ్డారు, మీ ఫోన్ కనెక్షన్‌ను కట్ చేస్తామని బెదిరించి ముంబై సీబీఐకి అనుసంధానం చేస్తామని తెలిపారు.
మనీ లాండరింగ్ అని..
తరువాత సీబీఐ అధికారి అంటూ గుర్తుతెలియని వ్యక్తి మొబైల్ వాట్సాప్ ద్వారా మహిళను సంప్రదించి మీరు మనీల్యాండరింగ్ కేసులో ఉన్నారు, మీపై అరెస్ట్ వారెంట్ ఉంది, అరెస్ట్‌చేస్తామని బెదిరించాడు. విచారణకు సహకరిస్తే అరెస్ట్ ఉండదని, ఇందుకోసం మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు డిపాజిట్ చేయాలని, కాల్‌ను కట్ చేయరాదని, ఎవరికీ చెప్పరాదని ఒత్తిడి చేశాడు. దీంతో భయపడిపోయిన ఆ మహిళ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ నుంచి మోసగాడు ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ కు రూ.6.80 లక్షలు, ఇండస్ ఇండ్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.3.41 లక్షలు జమ చేసింది. మరో రూ.2 లక్షలు జమచేయాలని మోసగాడు కోరగా, మహిళ అంగీకరించలేదు. డబ్బులు పడగానే మోసగాళ్లు ఫోన్లు స్విచాఫ్ చేశారు. బాధితురాలు సెంట్రల్ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
హైబ్రిడ్ విత్తనాలు వద్దు
తుమకూరు: డిమాండ్లను పరిష్కరించాలని సోమవారం కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, హసిరుసేనె తాలూకా శాఖల ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆందోళననుద్దేశించి పర్యావరణవేత్త సీ.యతిరాజు మాట్లాడారు. మోన్సాంటో, బేయర్, కార్గిల్ తదితర పెద్ద కంపెనీలు హైబ్రిడ్ విత్తనాలను రుద్దడం ద్వారా దేశీయ వంగడాలను, జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే హైబ్రిడ్ విత్తన చట్టం అమలును నిలిపేయాలని కోరారు. తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో రైతు నాయకులు చిక్కబోరేగౌడ, రవీష్, మోహన్ కుమార్, కృష్ణప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment