రాఘవేంద్రుని సన్నిధిలో రుషి సునక్ దంపతులు
బనశంకరి: బ్రిటన్ మాజీ ప్రధాని రుషి సునక్ దంపతులు జయనగర ఐదోబ్లాక్‌లోని శ్రీ గురురాఘవేంద్రుడి దర్శనం చేసుకున్నారు. మంగళవారం గురురాఘవేంద్రస్వామి మఠానికి సుధానారాయణమూర్తి దంపతులు, అల్లుడు, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషిసునక్ దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా రాఘవేంద్రస్వామి మఠంలో దీపాలు వెలిగించారు. ఈ సందర్బంగా మఠం సీనియర్ వ్యవస్థాపకుడు ఆర్‌కే.వాదీంద్రాచార్య, గురురాఘవేంద్ర వస్త్రం ఫలపుష్పాలు అందించి ఆశీర్వదించారు. అంతకు ముందు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో సునక్ దంపతులకు స్వాగతం పలికారు.
పెళ్లిపీటలు ఎక్కాల్సిన
వ్యక్తి హత్య
దొడ్డబళ్లాపురం: వాం రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కానిస్టేబుల్ హత్యకు గురైన సంఘటన హాసన్ తాలూకా దుద్ద గ్రామం వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అరసీకెరె తాలూకా బాగేశపుర గ్రామానికి చెందిన హరీష్(32) కర్ణాటక ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలనే వివాహం నిశ్చయమైంది. ఈనెల 11న వివాహం జరగాల్సి ఉంది. అందులో భాగంగా సోమవారం రాత్రి బంధువులు, స్నేహితులకు పెళ్లిపత్రికలు పంచి బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. దుద్ద గ్రామ శివారులో స్కైల్యాండ్ హోటల్ వద్ద బైక్‌ను అడ్డగించిన దుండగులు.. మారణాయుధాలతో దాడిచేసి హత్య చేసి పరారయ్యారు. దుద్ద పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
కాపలాదారుడిపై యాసిడ్ దాడి
మైసూరు : కాపలాదారుడిపై దుండగులు యాసిడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మైసూరు జిల్లా కేఆర్ నగరలో జరిగింది. గోవింద అనే వ్యక్తి నగరంలోని కే.ఆర్.నగరలోని గౌరీ శంకర సినిమా థియేటర్ కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఇతను థియేటర్ వద్ద కాలినడకన వెళ్తుండగా బైకులో వచ్చిన దుండగులు అతనిపై యాసిడ్ పోసి ఉడాయించారు. తీవ్రంగా గాయపడిన గోవిందను స్థానికులు పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. కేఆర్ నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వక్ఫ్ వివాదం..మంత్రి జమీర్‌పై హైకమాండ్‌కు లేఖ
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ఇప్పుడు వక్ఫ్ భూముల వివాదమే హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఇదంతా జరగడానికి మంత్రి జమీర్ అహ్మద్ అనేది కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. అందుకే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జమీర్ అహ్మద్‌పై హైకమాండ్‌కు లేఖ రాసినట్టు సమాచారం. విజయపుర, బాగలకోట, కలబుర్గి జిల్లాల్లో వక్ప్ బోర్డు పేరుతో రైతులకు నోటీసులు ఇవ్వడంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగులుతున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసారు. ఇటీవలే వారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా జమీర్‌పై ఫిర్యాదులు చేసారు. అయితే సిద్దరామయ్య ప్రియ శిష్యుడిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జమీర్ వ్యాఖ్యలు, ప్రవర్తన పార్టీని నష్టం వాటిల్లుతోందని, ఇది ముదిరి ప్రభుత్వానికి కంటకంగా మారవచ్చని ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.
బైక్‌పై తీసుకెళ్లే పిల్లలకు సేఫ్టీబెల్ట్ తప్పనిసరి
బనశంకరి: రాష్ట్రంలో రోజురోజుకు బైక్ ప్రమాదాలు సంఖ్య హెచ్చుమీరుతోంది. వాహనదారులు సురక్షత కోసం ప్రభుత్వం, రవాణాశాఖ అనేక ముందు జాగ్రత్తచర్యలు తీసుకుంటుంది. 4 ఏళ్ల లోపు పిల్లలను పాఠశాల లేదా ఇతర పనులకు బైక్‌ల్లో వెనుక, లేదా ముందు కూర్చోబెట్టుకుని వెళ్తున్నప్పుడు వారికి శిశు కవచ(సీట్‌బెల్ట్) అమర్చాలి. లేకపోతే బైక్‌దారుడిపై కేసు నమోదు చేయడంతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. కేంద్ర మోటారు వాహనచట్టం 2019 అనుగుణంగా ఈ నిబంధనలు విధించారు. దీనిపై రవాణాశాఖ అన్ని జిల్లాల్లో జాగృత కార్యక్రమాలు చేపట్టింది. గతంలో కూడా ఈ నిబంధన అమల్లో ఉంది. కానీ సమర్థవంతంగా అమలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment