బస్సులు నడపాలని నిరసన
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన సమయంలో బస్సులు నడపాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం లింగసూగూరు తాలూకా జాగీర్ నందిహాళ వద్ద రోడలబండ, ఆనెహోసూరు విద్యార్థులు బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు. గ్రామానికి వచ్చిన బస్సును, డ్రైవర్, కండక్టర్లను స్తంభింపజేసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నిత్యం నాలుగు సార్లు ప్రయాణించే బస్సులను కేవలం రెండు సార్లు తిప్పి బంద్ చేయడాన్ని ఖండించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: దావణగెరె మహానగర పాలికెలో పని చేస్తున్న వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం దావణగెరె మహానగర పాలికె ఉద్యోగి లక్ష్మణ్(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా ఆయన విధులకు హాజరుకాకుండా జీవితంపై విరక్తితో బలవన్మరణం చెందినట్లు అక్కడి టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
మధ్యాహ్న భోజన పంపిణీ వద్దు
బళ్లారి అర్బన్: తాలూకాలోని శ్రీధరగడ్డ, తాళూరు రోడ్డు చుట్టుపక్కల గ్రామీణ పాఠశాలలకు కొత్తగా ఇస్కాన్ అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనాన్ని ఇకపై పంపిణీ చేయరాదని రాష్ట్ర సంయుక్త అక్షర దాసోహ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. సదరు సంఘం నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతోనే ఎన్‌జీఓలు మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ పథకం ద్వారా పని చేస్తున్న కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా యథావిధిగా మధ్యాహ్న భోజనం ఆయా పాఠశాలల్లో వండి పంపిణీ చేసేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రమోద్, నాగరత్న, మంజుల, జయమ్మ, దుర్గమ్మ, మంగళమ్మ, హేమావతి, బసమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు
ప్రారంభించరూ..
రాయచూరు రూరల్: జిల్లాలో వరి, పత్తి పండించిన రైతులు కంది, పత్తి, వరి, జొన్న కోతలు ప్రారంభం కావడంతో ఏపీఎంసీలో వరి, పత్తి, కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సిరవార తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు వీరేష్ నాయక్ మాట్లాడారు. అకాల వర్షం వల్ల పంటలు నేలకొరిగిన అంశంపై వ్యవసాయ, రెవిన్యూ శాఖాధికారులు పంటను సర్వేలు జరిపి పంటనష్టం అంచనాలను వేయాలన్నారు. పత్తి దిగుబడులు అధికంగా రావడంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా మధ్యవర్తుల బెడదను నివారించి రైతులకు మద్దతు ధరలతో కొనుగోలుకు శ్రీకారం చుట్టాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నాగరాజ్, హులిగప్ప, మడివాళ, హనుమంతు, కృష్ణమూర్తి, మారెప్ప, మల్లయ్య, బసవ, హనుమంతులున్నారు.
పరీక్షలపై విచారణకు ర్యాలీ
రాయచూరు రూరల్: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్(కేపీఎస్‌సీ) ఆధ్వర్యంలో జరిగిన పంచాయతీ అభివృద్ధి అధికారుల(పీడీఓ) పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ జరపాలని భారత క్రాంతికార రైతు, వ్యవసాయ, కార్మిక ప్రాంత సంఘం అధ్యక్షుడు అజీజ్ పేర్కొన్నారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. సింధనూరు ప్రభుత్వ కళాశాలలో జరిగిన పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ, కొంత మంది అభ్యర్థులకు ప్రశ్న పత్రాలు అందక పోవడం వంటి అంశాలపై విచారణ చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment