ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం
●బెంగళూరులో విషాదం
బనశంకరి: పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలను తల్లి హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. జార్ఘండ్‌కు చెందిన సునీల్‌సాహు, మమతాసాహు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు శుంభుసాహు (7), శ్రేయా (3) ఉన్నారు. 8 నెలలు క్రితం బెంగళూరు నగరానికి చేరుకుని ఉత్తరహళ్లి మునిస్వామిలేఔట్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సునీల్ సాహు ఓలా ఆటో డ్రైవరుగా పనిచేస్తున్నారు. సునీల్‌సాహు మొబైల్‌లో జార్ఘండ్ యువతితో మాట్లాడటాన్ని భార్య గమనించి గొడవపడింది. గురువారం రాత్రి ఇదే విషయంపై దంపతుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సమయంలో సునీల్‌సాహు బయటికి వెళ్లారు. అనంతరం ఇద్దరు పిల్లలను తాడుతో గొంతు బిగించి హత్య చేసిన మమతా సాహు తాను కూడా తాడుతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో తాడు తెగిపోయింది. అనంతరం చాకుతో గొంతు కోసుకుని కిందపడిపోయింది. బయటికి వెళ్లిన సునీల్‌సాహు రాత్రి 10.30 గంటలకు ఇంటికి చేరుకోగా పిల్లలు హత్యకు గురైనట్లు గుర్తించాడు. భార్య రక్తపు మడుగులో ఉన్నట్లు గమనించి ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడింది. పిల్లలు మృతి చెందడం పట్ల సునీల్‌సాహు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
మొబైల్ చోరుల ఆటకట్టు
కృష్ణరాజపురం : బెంగళూరు నగరంలోని సిటీ బస్సుల్లో ప్రయాణిస్తూ సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న నలుగురు పట్టుబడ్డారు. లిఖిన్ విశాల్, వెరాకులా సాకిమ్ అనే ఇద్దరిని కామాక్షిపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.6.60 లక్షల విలువ చేసే 38 మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకున్నారు. అదే విధంగా మహాలక్ష్మి లేఔట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాకలి మనోహర్(24), కొమ్ము ప్రశాంత్(24) అనే ఇద్దరిని యశ్వంతపుర రైల్వేస్టేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.15 లక్షల విలువైన 60 మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకున్నారు. నిందితులు ఈ ఫోన్లను ఏపీలో తక్కువ ధరకు విక్రయించేందుకు వెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు.
మంత్రి జమీర్ కార్యాలయం ముట్టడికి యత్నం
శివాజీనగర: వక్ఫ్ బోర్డు వివాదం నేపథ్యంలో శుక్రవారం బెంగళూరులో మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ కార్యాలయ ముట్టడికి శ్రీరామసేన సంస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ యత్నించారు. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా శ్రీరామసేనా శుక్రవారం ధర్నా నిర్వహించింది. అంతకుముందు చారమరాజపేట మహాదేశ్వర ఆలయంలో పూజలు జరిపారు. అనంతరం ప్రమోద్ ముతాలిక్ నేతృత్వంలో ర్యాలీగా వెళ్లి మంత్రి జమీర్ అహమ్మద్ కార్యాలయం వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ అవసరం లేదు వాహనంలో వెళ్లి వినతిపత్రం సమర్పించాలని పోలీసులు సూచించారు. అయినా వినకపోవడంతో ముతాలిక్‌ను అరెస్ట్ చేశారు.
కేసు విచారణ వాయిదా
బొమ్మనహళ్లి : ప్రముఖ వ్యాపార వేత్తను రూ. 50 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు నమోదైన కేసులో కేంద్ర మంత్రి కుమారస్వామికి కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కుమారస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఎం.నాగప్రసన్నతో కూడిన ఏకసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పొడిగిస్తూ కేసు విచారణను డిసెంబర్ 12వ తేదికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment