పేదలకు అన్యాయం జరగనివ్వం
మైసూరు: ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులను తప్ప వేరే ఎవరినీ బీపీఎల్ కార్డుల నుంచి తొలగించవద్దని అధికారులకు సూచించినట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఆయన శుక్రవారం నగరంలోని మండకళ్లి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ వారు రాజకీయ లబ్ధి కోసం బీపీఎల్ కార్డుల రద్దు విషయాన్ని ప్రస్తావిస్తున్నారన్నారు. బీజేపీ వారికి పేదల గురించి మాట్లాడే ఎలాంటి నైతికత లేదన్నారు. బీపీఎల్ కార్డుదారులకు రాష్ట్రంలో7 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చింది తమ ప్రభుత్వమేనన్నారు. ఆ 7 కేజీలను 5 కేజీలకు కుదించింది యడియూరప్ప ప్రభుత్వమని గుర్తు చేశారు.
నబార్డు తక్కువ రుణంతో తప్పని ఇబ్బందులు
నబార్డు నుంచి రాష్ట్రానికి అందిస్తున్న రుణ ప్రమాణాన్ని 58 శాతం మేరకు తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర రైతులకు ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల వద్దకు రుణాల కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు. నబార్డు 4.5 శాతం వడ్డీతో రాష్ట్రానికి రుణం ఇచ్చేదన్నారు. దీంతో తాము రైతులకు రూ.5 లక్షల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేవాళ్లమన్నారు. ఇప్పుడు నబార్డు రుణప్రమాణాన్ని తగ్గించినందున ఇకపై రైతులకు వడ్డీ లేకుండా రుణాలివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కష్టకరం అవుతుందన్నారు.
సీఎం సిద్దరామయ్య
Comments
Please login to add a commentAdd a comment