సాక్షి బెంగళూరు : రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచీగా పిలుస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. రాష్ట్రంలోని చెన్నపట్టణ, శిగ్గావి, సండూరు నియోజకవర్గాలకు ఈనెల 13న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మూడు స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక రాష్ట్రంలో మున్ముందు రాజకీయ చదరంగంలో పావులు ఎలా కదులుతాయనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు, ప్రజలు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చెన్నపట్టణ, శిగ్గావిలో ఎన్‌డీఏ అభ్యర్థులు, సండూరులో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అసలైన ఫలితాల్లో విజయం ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
20 రౌండ్లలో...
ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం 6.45 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 6.45 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల్లోని ఈవీఎం యంత్రాలను బయటకు తీసుకురానున్నారు. 7.30 గంటలకు పోస్టల్‌బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు ఈవీఎం ఓట్లను గణించనున్నారు. మొత్తంగా 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం కేంద్రాలను కూడా ఎన్నికల కేంద్రం నిర్ణయించింది.
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే
శిగ్గావి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ హావేరి జిల్లా దేవగిరిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో చేపట్టనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన హాల్‌లో మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సండూరు స్థానం కోసం బళ్లారిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక హాల్‌ను ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. అక్కడ కూడా 14 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. చెన్నపట్టణ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం రామనగర లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం 3 హాళ్లను సిద్ధం చేశారు. ఇక్కడ 15 టేబుళ్లను ఏర్పాటు చేశారు. శిగ్గావిలో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 57 మంది అధికారులను, సండూరులో 62 మందిని, చెన్నపట్టణలో 93 మంది అధికారులను నియమించారు.
నేడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ
Comments
Please login to add a commentAdd a comment