No Headline
బనశంకరి: రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠ కలిగించిన మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. బీజేపీ–జేడీఎస్ కూటమికి భంగపాటే మిగిలింది. ఈ నెల 13న పోలింగ్ జరిగితే, శనివారం ఆయా జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. రెండు మూడు రౌండ్ల నుంచి హస్తం అభ్యర్థులు ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. దీంతో ప్రతిపక్ష కూటమి నేతలు డీలా పడగా, కాంగ్రెస్ కార్యకర్తలు చిందులేశారు.
అంచనాలు తారుమారు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ– జేడీఎస్ కూటమి మధ్య నువ్వా నేనా అనే పోటీ ఏర్పడింది. ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయాలను మారుస్తాయని, కాంగ్రెస్ ఓడిపోతే సర్కారు అస్థిరం కావచ్చని అంచనాలను తుత్తినియలు చేస్తూ మూడింటా హస్తం హవా వీచింది. ముడా ఇళ్లస్థలాల కుంభకోణం, వాల్మీకి అభివృద్ధి మండలిలో వందలాది కోట్ల రూపాయల స్కాం, వక్ఫ్ భూ చట్టం వివాదం లాంటివి కాంగ్రెస్‌కు ఇబ్బంది కలిగించలేకపోయాయి.
అసెంబ్లీలో కాంగ్రెస్ ఆధిక్యం పెంపు
ఈ విజయాలతో కాంగ్రెస్ బలం రెండు సీట్లు పెరిగి 137కు ఎగబాకింది. బీజేపీ, జేడీఎస్‌కు తలా ఒక ఎమ్మెల్యే తగ్గిపోయారు. గతేడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 66, జేడీఎస్ 19, కాంగ్రెస్ 135 సీట్లలో గెలిచాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ తలా ఓ సీటును కోల్పోయాయి.
నిరాశకు గురయ్యా: విజయేంద్ర
శివాజీనగర: చెన్నపట్టణలో మిత్రపక్షం జేడీఎస్, సండూరు, శిగ్గావిలో బీజేపీ గెలుస్తాయనే నమ్మకం ఉండేది. అయితే నిరాశకు గురైనమాట నిజం అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తెలిపారు. ఫలితాల తరువాత బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఓటమికి కారణాలపై రెండు పార్టీల నాయకులు కూర్చొని చర్చిస్తాం. కారణం కనుగొంటామన్నారు. సండూరులో తొలిసారిగా బీజేపీ సుమారు 80 వేల ఓట్లు పొందింది. ఎనిమిది, పది వేల తేడాతో గెలుస్తామనే విశ్వాసముండేది. సండూరు ఫలితాలను ఓటమిగా భావించను. అయితే శిగ్గావి మాత్రం మాకు ఆందోళనకు గురిచేసింది. మాజీ సీఎం బసవరాజ బొమ్మై అక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. పరాజయానికి కారణాలను తెలుసుకొంటామని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.
గెలుస్తాననే అనుకున్నా: యోగేశ్వర్
దొడ్డబళ్లాపురం: దేవేగౌడ కుటుంబాన్ని, వారి నాయకత్వాన్ని ఒక్కలిగులు తిరస్కరించారని, నిఖిల్ ఓటమితో జేడీఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని చెన్నపట్టణలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి యోగేశ్వర్ అన్నారు. బెంగళూరులో నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికలకు ముందే 30 వేల మెజారిటీతో గెలుస్తానని నమ్మకం ఉండేదన్నారు. 36 ఏళ్ల నిఖిల్ 63 ఏళ్ల వృద్ధునిలా మాట్లాడతాడన్నారు. యడియూరప్ప, విజయేంద్రల కుట్రల వల్లే తాను బీజేపీని త్యజించాల్సి వచ్చిందన్నారు. తాత, తండ్రి నిర్వాకాలే నిఖిల్ ఓటమికి కారణాలన్నారు.
ఓటర్లకు ధన్యవాదాలు: నిఖిల్
చెన్నపట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తానని బీజేపీ–జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి అన్నారు. బిడదిలోని తన ఫాంహౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలన్నారు. 87 వేల ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు రుణపడి ఉంటానన్నారు. ఓటమిపాలైనా చెన్నపట్టణ ప్రజలకు అండగా ఉంటానన్నారు.
సండూరు, శిగ్గావి, చెన్నపట్టణ
ఉప ఎన్నికల్లో గెలుపు
బీజేపీ– జేడీఎస్ కూటమికి తీవ్ర నిరాశ
వారసులకు ఓటర్ల మొండిచేయి
పనిచేయని దేవెగౌడ– కుమార మ్యాజిక్
Comments
Please login to add a commentAdd a comment