బ్యాటరీ స్కూటర్ బుగ్గి
దొడ్డబళ్లాపురం: ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగి న సంఘటన మాగడి తాలూకా కల్యా గ్రామంలో చోటుచేసుకుంది. జయణ్ణ అనే వ్యక్తి తన బ్యాటరీ స్కూటర్‌ను షాపు ముందు నిలిపి ఉండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో స్కూటర్ కాలిపోయింది. ఇటీవలే రూ.90 వేలు వెచ్చించి ఈ స్కూటర్ కొనుగోలు చేసినట్టు జయణ్ణ తెలిపాడు. ఇక జన్మలో ఇలాంటి స్కూటర్ వాడనని చెప్పారు. ఇటీవల బెంగళూరులో బ్యాటరీ స్కూటర్ల షోరూం కాలిపోయి యువతి మరణించడం తెలిసిందే.
అవినీతి మరక పోదు: విశ్వనాథ్
మైసూరు: రాష్ట్రంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సీఎం సిద్దరామయ్య పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. మైసూరులో ఆయన మాట్లాడుతూ గెలుపు దక్కినంత మాత్రాన ముడా, వాల్మీకి కార్పొరేషన్ అవినీతి అక్రమాలు మాసిపోవని అన్నారు. అందువల్ల గెలిచినవారు సంతోష పడాల్సిన పని లేదన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమవుతాయన్నారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని ఓటు వేశారు తప్ప సిద్దరామయ్య తప్పు చేయలేదని కాదని అన్నారు.
లారీని కారు ఢీ, జంట మృతి
దొడ్డబళ్లాపురం: విహారయాత్ర విషాద యాత్రగా ముగిసింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఫార్చూనర్ కారు వెనుక నుండి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన చెన్నపట్టణ తాలూకా కోలూరు గేట్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. మృతులు గోవా వాసులు డారెల్ నోవ ఆలేన్‌వేజ్ (55), రోజ్ ప్రాన్సిస్ (40) దంపతులుగా గుర్తించారు. లారీ డ్రైవర్ ఇండికేటర్ వేయకుండానే హఠాత్తుగా టర్న్ తీసుకోవడంతో వెనుక వేగంగా వస్తున్న ఫార్చూనర్ కారు కంట్రోల్ తప్పి లారీని ఢీకొంది. గోవా నుంచి ఊటీకి విహారయాత్ర కోసం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. చెన్నపట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వరుసగా వాహనాలు ఢీ..
20 మందికి గాయాలు
దొడ్డబళ్లాపురం: ప్రైవేటు బస్సు, కేఎస్‌ఆర్టీసీ బస్సు, కారు వరుసగా ఢీకొన్న ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడిన సంఘటన బెంగళూరు– మంగళూరు జాతీయ రహదారిపై పుత్తూరు వద్ద చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక కళాశాల విద్యార్థులు ప్రైవేటు బస్సులో కుందాపురకు టూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పుత్తూరు తాలూకా అడ్డహొళె గ్రామం వద్ద హైవేలో అదుపుతప్పి ముందు వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సును ఢీకొంది. బస్సు వెనుకే వస్తున్న కారు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఉప్పినంగడి పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment