అక్రమ ఇసుకపై దాడులు
గౌరిబిదనూరు: మంచేనహళ్ళి తాలూకా బిసలహళ్ళి గ్రామం నుంచి అలకాపురం రస్తాలో
పొలాల మధ్య రోడ్డు వేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న తిమ్మారెడ్డి, డ్రైవర్ రవికుమార్ లను అరెస్టు చేసి రూ.55 లక్షల విలువైన టిప్పర్, జేసీబీలను చిక్కబళ్ళాపురం సైబర్ క్రైం పోలీసులు సీజ్ చేశారు. సమాచారం రావడంతో మంగళవారం తెల్లవారుజామున దాడులు చేశారు. పోలీసులు రవికుమార్, సూర్యప్రకాశ్, శరత్ కుమార్, సుబ్రమణి పాల్గొన్నారు.
హైకోర్టులో ముడా కేసు వాయిదా
బనశంకరి: ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వేసిన పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం విచారణ సాగింది, భూమి మూల యజమాని దేవరాజు తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలనే ఆదేశాలను అప్పీల్ చేశారని, విచారణ దశలో ఉందని, సంబంధం లేకపోయినా విచారణను ఎదుర్కోవలసి వస్తుందని, విచారణను వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వ వకీలు శశికిరణ్ శెట్టి వాదిస్తూ కొందరు ప్రతివాదులకు నోటీసులు జారీకాలేదని, దీంతో సమయం ఇవ్వాలని కోరడంతో జడ్జి ఆ మేరకు వాయిదా వేశారు.
పలు జిల్లాలకు వర్షసూచన
యశవంతపుర: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని బెంగళూరులోని వాతావారణ కేంద్రం తెలిపింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, బెంగళూరు నగర, గ్రామాంతర, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, చిత్రదుర్గ, కొడగు, కోలారు, రామనగర, శివమొగ్గ, తుమకూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు.
బొలెరో డ్రైవర్ దుర్మరణం
పావగడ: స్థానిక తుమకూరు రోడ్డులోని ఎస్‌ఆర్‌ఎస్ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ గిరీష్ (21) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం ఉదయం పావగడ వైపుగా పెయింట్ల డబ్బాలతో వస్తున్న బొలెరో వాహనం పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. వాహనంలోనే చిక్కుకుని డ్రైవర్ గిరీష్ దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఎదురుగా వస్తున్న ఒమినీ వాహనాన్ని తప్పించబోయి ఉన్నఫళంగా తన మార్చాన్ని మార్చుకోవడంతో ఆ వెనుకనే ఉన్న బొలెరో ఢీకొన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడు మండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమనహళ్లికి కి చెందిన పుట్టస్వామి కుమారుడు గిరీష్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ సురేష్, ఎస్‌ఐ గురునాథ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment