ధృవనక్షత్రం రాలిపోయింది
●
● ఎస్‌ఎం మరణంపై డీసీఎం
బనశంకరి: ఎస్‌ఎం కృష్ణ కు వెల్లువలా నివాళులు అర్పించారు. నగరంలో సదాశివనగరలోని ఆయన ఇంటికి తరలివచ్చారు. అజాత శత్రువు, దూరదృష్టి కలిగిన నేత ఎస్‌ఎం కృష్ణ మృతి రాష్ట్రానికి తీరనిలోటు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. తన రాజకీయ మార్గదర్శకుడు అని, కర్ణాటక రాజకీయ రంగంలో ధృవ నక్షత్రం రాలిపోయిందన్నారు. కెంపేగౌడ నిర్మించిన బెంగళూరు నగరాన్ని ప్రపంచమే చూసేలా తీర్చిదిద్డడంలో ఎస్‌ఎం.కృష్ణ పాత్ర ఎనలేనిదన్నారు. మాజీ ఎంపీ, నటి రమ్యా.. ప్రస్తుతం నేను మాట్లాడే పరిస్థితుల్లోలేనని ఆవేదన చెందారు.
● కృష్ణ మరణం రాష్ట్రానికి తీరనిలోటు అని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నారు. ఆయన తమ కుటుంబ సభ్యునిగా ఉండేవారని, తనకు చాలా ప్రోత్సాహం అందించారని కర్ణాటక, బెంగళూరుకు అందించిన సేవలు అపారమన్నారు.
● కృష్ణ హుందాగా నడుచుకునే రాజకీయనేత, బెంగళూరు నెంబర్‌వన్ కావడానికి ఆయనే కారణం అని మాజీ ఎంపీ సుమలత తెలిపారు. నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ మండ్య గర్వించే సుపుత్రుడుగా ఉన్నారని, ఇకపై ఇలాంటి రాజకీయ నేతను చూడటం సాధ్యం కాదన్నారు.
మా కుటుంబానికి అండ: శివు
శివాజీనగర: ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ నివాళులర్పించి అనుబంధాన్ని స్మరించుకొన్నారు. నాన్న రాజ్‌కుమార్‌ని వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో ఎస్.ఎం.కృష్ణ తమ కుటుంబానికి అండగా నిలిచారు. సీఎం ఎలా ఉండాలంటే కృష్ణ మాదిరిగా ఉండాలి. క్రమశిక్షణతో పనిచేస్తారు. ఆయన కుటుంబంతోనూ సత్సంబంధం ఉందన్నారు. లేరనేది తలచుకుంటే దుఃఖం వస్తుందని, ఆయన కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment