ఉభయ సభల్లో పెను రచ్చ
శివాజీనగర: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా... రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కించపరిచేలా మాట్లాడారంటూ అధికార కాంగ్రెస్ నిరసనలకు దిగింది. గురువారం బెళగావి సువర్ణసౌధ అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంబేడ్కర్ ఫోటో పట్టుకొని ధర్నా చేపట్టారు.
ఎగువసభలో
విధాన పరిషత్‌లో కూడా ఇదే మాదిరి రభస చోటుచేసుకుంది. సభాపతి బసవరాజ్ హొరట్టి, ప్రశ్నోత్తరాలకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సభ్యుడు బీ.కే.హరిప్రసాద్ తదితరులు అంబేడ్కర్ ఫొటోలను ప్రదర్శించారు. అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారు, దీనిపై చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు చలవాది నారాయణస్వామి, సీ.టీ.రవి తో పాటుగా పలువురు.. విస్తృత చర్చ జరగనీ, తాము భయపడబోమన్నారు. హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ బీజేపీపై ఆరోపణలు చేయసాగారు. బీజేపీ రహస్య అజెండా ఏమిటో తేలిపోయిందన్నారు. అమిత్‌షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.
కేంద్రమంత్రి అమిత్ షాపై
అధికార కాంగ్రెస్ ధ్వజం
అంబేడ్కర్ చిత్రపటంతో నిరసన
ఫోటోలతో ఆందోళన
విధానసభలో చర్చల మధ్యలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటుగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, సభ్యులంతా అంబేడ్కర్ చిత్రాన్ని పట్టుకొని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. దీంతో కార్యకలాపాలు ముందుకు సాగలేదు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొని స్పీకర్ ఖాదర్.. సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా తరువాత కూడా అధికార పార్టీ సభ్యులు, మంత్రులంతా కలిసి ముందు వరుసలోకి చేరుకొని ఫోటోలను పట్టుకొని, ఆర్‌ఎస్‌ఎస్, అమిత్ షాపై గళమెత్తారు. సభలోకి వచ్చిన సీఎం తన సీటులో కూర్చుని అంబేడ్కర్ ఫోటోని ప్రదర్శించారు. అమిత్ షాపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ దశలో బీజేపీ సభ్యుడు గురురాజ్ గంటివళి కూడా అంబేడ్కర్ ఫోటోను ప్రదర్శించి, తాము ఆయన అభిమానులమని, కాంగ్రెస్ వల్లనే అంబేడ్కర్‌కి అన్యాయం అయిందని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురురాజ్‌తో వాగ్వివాదానికి దిగారు. ఈ దశలో మంత్రి భైరతి సురేశ్, గంటివళి ఏకవచనంతో దూషణల్లో నిమగ్నమయ్యారు. సభ వాయిదా పడినా ఎవరూ బయటకు వెళ్లకుండా ఫోటోలను ప్రదర్శించి, నినాదాలు చేయసాగారు. తరువాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. అమిత్ షాపై అనవసరంగా బురదచల్లుతున్నారని జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment