ప్రతిభ వెలికితీతకు కారంజి వేదిక
బళ్లారిటౌన్: పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతిభా కారంజి వంటి కార్యక్రమాలు దోహదపడుతాయని సెయింట్ జాన్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఫాదర్ ఫ్రాన్సిస్ బీ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సెయింట్ జాన్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ప్రతిభా కారంజి కళా ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందన్నారు. దానిని నిరూపించుకొనేందుకు పిల్లలకు ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయన్నారు. పిల్లలను ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా గుర్తించాలన్నారు. క్రీడల్లో ఓటమి, గెలుపు సర్వసాధారణం అని, గెలుపు కోసం కాకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డీ.ఉమాదేవి మాట్లాడుతూ పాఠశాలలో విద్యతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలకు హెచ్చు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకొని జిల్లాకు మంచి పేరు సంపాదించాలన్నారు. డయట్ డీడీ ప్రకాష్, విద్యా శాఖ నోడల్ అధికారి వీరేశప్ప, ప్రధానోపాధ్యాయులు శాంతశీలన్, వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment