వాడీవేడిగా సామాన్య సమావేశం
● చర్చకు అవకాశం ఇవ్వని పాలకపక్షం
● బహిష్కరించిన బీజేపీ కార్పొరేటర్లు
బళ్లారిటౌన్: నగరంలోని జెడ్పీ నజీర్ సభాంగణంలో శుక్రవారం జరిగిన కార్పొరేషన్ సామాన్య సమావేశం వాడీవేడిగా జరిగింది. పలు అంశాలపై బీజేపీ కార్పొరేటర్లు చర్చకు లేవనెత్తగా, వాటికి సరైన సమాధానం ఇచ్చి చర్చించేందుకు సమయం కల్పించలేదని నిరసిస్తూ బీజేపీ కార్పొరేటర్లందరూ సమావేశాన్ని బహిష్కరించారు. సమావేశం ప్రారంభంలోనే ప్రతిపక్ష నేత ఇబ్రహిం బాబు కొన్ని అంశాలపై చర్చించేందుకు సన్నద్ధం కాగా జనరల్ బాడీ సమావేశంలో పలు అంశాలు తీర్మానం కావాల్సినవి ఉన్నాయని, అవి పూర్తి కాగానే సమయం కేటాయిస్తామని మేయర్ ముల్లంగి నందీష్ చెప్పడంతో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అయితే తీర్మానం అనంతరం ఇబ్రహిం బాబుతో పాటు హనుమంతు, గోవిందరాజులు తదితరులు మాట్లాడుతూ మహాదేవ, గౌస్, అనే ఇంజినీర్లు లోకాయుక్త దాడిలో పట్టుబడగా గౌస్‌ను సస్పెండ్ చేయగా, మహాదేవ అనే ఇంజినీర్‌ను సస్పెండ్ చేయకుండా ఎలా పదోన్నతి కల్పించారని నిలదీశారు.
అవినీతిపరులకు పదోన్నతులా?
కార్పొరేషన్‌లో అవినీతికి పాల్పడుతున్న వారికి ఎలా పదోన్నతి ఇస్తారని ధ్వజమెత్తారు. ఇదే విధంగా నగరంలో పన్నులు వసూలు చేసి నకిలీ బిల్లులను సృష్టించి ఆ సొమ్మును కాజేశారని, ఇలాంటి వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఒత్తిడి చేశారు. అంతేగాక నగరంలో నాలుగు జేసీబీలను కార్పొరేషన్ నుంచి కేటాయించగా వాటిని పలువురు కాంట్రాక్టర్లు, రాజకీయ నేతలు తమ సొంత పనులకు వాడుకుంటున్నారని, వీటికి జీపీఎస్‌లను అమర్చలేదని ధ్వజమెత్తారు. కాగా ఒకటి తర్వాత మరొక్కటి ప్రశ్నలను లేవనెత్తుతుండగా మేయర్ నందీష్ వారికి సమాధానం ఇస్తూ లోకాయుక్త కేసు కోర్టులో ఉన్నాయని, ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ పంపారని, ఆ నివేదికపై ఆదేశాలు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
జేసీబీలకు జీపీఎస్ అమర్చండి
అదే విధంగా జేసీబీలకు జీపీఎస్ అమర్చేందుకు అధికారులను ఆదేశించారు. కాగా పన్నుల వసూలులో అవినీతిపై సరైన సమాచారం ఇవ్వాలని పట్టుబట్టడంతో పాటు వివిధ సమస్యలను లేవనెత్తడంతో అధికారుల నుంచి సరైన స్పందన లేనందున బీజేపీ కార్పొరేటర్లు ఇబ్రహింబాబు, గోవిందరాజులు, హనుమంతు, కే.హనుమంతు, తిలక్, శ్రీనివాస్ మోత్కూర్‌తో పాటు మహిళా కార్పొరేటర్లు కూడా సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు. కాగా వారు వెళ్లిపోయినప్పటికీ కొన్ని అంశాలపై కాంగ్రెస్ సభ్యులు తీర్మానించి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్, ఉపమేయర్ సుకుం, స్థాయి సమితి అధ్యక్షురాలు పద్మ రోజా, కార్పొరేటర్లు ఈరమ్మ సోగి, సురేష్, నూర్ మహ్మద్, గాదెప్ప, ప్రభంజన్‌కుమార్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment