ఎమ్మెల్సీపై దాడి అమానుషం
రాయచూరు రూరల్: బెళగావిలోని సువర్ణ సౌధలో విధాన పరిషత్ సభ్యుడు సీ.టీ.రవిపై దాడి అమానుషమని బీజేపీ ఆరోపించింది. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు శివరాజ్ పాటిల్ మాట్లాడారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ మద్దతుదారులు దాడి చేయడాన్ని ఖండించారు. మంత్రి దగ్గర ఉండి ఈ దాడులకు పురిగొల్పారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గళమెత్తడం తప్పా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో నైతిక బాధ్యత వహించి మంత్రి లక్ష్మి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
సిటీ రవి అరెస్ట్‌పై ఆందోళన
హుబ్లీ: ఎమ్మెల్సీ సీటీ రవి అరెస్ట్‌ను ఖండిస్తూ ధార్వాడ జిల్లాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో భారీగా ఆందోళన చేపట్టారు. ఉగ్రవాదుల్లా పోలీసులు ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారని ఆందోళనకారులు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని హత్య చేసే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే వేళ సీటీ రవిని అరెస్ట్ చేయడం రాజ్యాంగానికి అవమానం చేసినట్లేనని ఆక్రోశించారు. సిద్దు సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో నిజాలు వెలుగు చూసినా దేశద్రోహులను అరెస్ట్ చేయలేక పోయారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికీ మరవలేదన్నారు. సీటీ రవి పట్ల కాంగ్రెస్ నాయకులు ద్వేష రాజకీయాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment