భారీ భద్రత మధ్య బెంగళూరుకు సీటీ రవి
శివాజీనగర: మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను అసభ్యపదజాలంతో దూషించి అరెస్ట్ అయిన బీజేపీ ఎమ్మెల్సీ సీ.టీ.రవిని పోలీసులు శుక్రవారం భారీ పోలీసు భద్రత మధ్య బెంగళూరుకు తీసుకువచ్చి జెఎంఎఫ్‌సీ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు సీటీ రవిని బెళగావిలోని హీరేబాగేవాడి పోలీసులు బెళగావి 5వ జెఎంఎఫ్‌సీ కోర్టులో హాజరు పరిచారు. బెయిల్ కోసం సీటీ రవి తరఫు న్యాయవాది పిటిషన్ సమర్పించగా వాద–ప్రతివాదనలను న్యాయవాది ఆలకించి తీర్పు రిజర్వు చేశారు. ఇదిలా ఉండగా సీ.టీ.రవిని బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి హాజరుపరిచేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని తనిఖీ అధికారులు కోర్టుకు విన్నవించారు. జడ్జి స్పర్శా డిసోజా ఆదేశాల మేరకు సీటీ రవిని పోలీసులు బెంగళూరుకు భారీ భద్రత మధ్య తీసుకువచ్చి ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానమచ్చిన సీ.టీ.రవి.... ‘గురువారం శవం చిక్కమగళూరుకు వెళుతుందని’ మంత్రి బెదిరించారన్నారు. తనను పోలీసులు రహాస్య స్థలంలోకి తీసుకెళ్లగా ఖానాపురలో కొందరు దాడిచేశారని, రక్త గాయమైందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎవరు కొట్టారని న్యాయమూర్తి ప్రశ్నించగా పోలీసులు కొట్టి ఉండవచ్చన్నారు. సీటీ రవి తరఫు న్యాయవాది జిరలి వాదన వినిపిస్తూ గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో పోలీసులు రవిని అరెస్ట్ చేశారని, రాత్రంతా నందగడ, ఖానాపుర, ధార్వాడ, గదగ్, రామదుర్గ, సవదత్తి ఇలా అన్నిచోట్ల పోలీసులు తిప్పారన్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పోలీసులకు ఎవరిదో ఫోన్ వస్తుండేదని, వారి సూచన మేరకు పోలీసులు వ్యవహరంచారని కోర్టు దృష్టికి తెచ్చారు. పైగా సీటీ రవిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని పోలీసులు చెప్పలేదన్నారు. పోలీసులు ఆయన గడియారం లాక్కొనే ప్రయత్నం చేశారని తెలిపారు. సి.టీ.రవి ఫిర్యాదు చేసినా పోలీసులు స్వీకరించలేదన్నారు. రవి సాధారణ వ్యక్తికాదని, ఆయన రౌడీ కూడా కాదని, ఘటన జరిగింది సువర్ణ విధానసౌధలో అని, ఆయన అరెస్ట్‌కు సభాపతి అనుమతి అవసరముందని, పోలీసులు ఎలాంటి ప్రక్రియను సరిగా చేయలేదని న్యాయవాది జిరలి వాదనను వినిపించారు.
నా ప్రాణానికి ముప్పు ఉంది
తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను అంతమొందించే కుట్ర జరుగుతోందని, తనకు ఏమైనా జరిగితే అందుకు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, డీసీఎం డీ.కే.శివకుమార్,మంత్రి హెబ్బాళ్కర్ కారణమని సీటీ రవి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సీటీరవిని ఐదారుగంటలపాటు పోలీసుల వాహనంలో ఉంచి తిప్పారని, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వాహనం ఆపి ఎవరితోనే ఫోన్‌లో చర్చలు జరిపారని బీజేపీ ఒక వీడియో విడుదల చేసింది.
జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు
రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారు
కోర్టు దృష్టికి తీసుకువచ్చిన సీటీ రవి
సీటీ రవికి మధ్యంతర బెయిల్
బొమ్మనహళ్లి: సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌ను సభలో అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలపై అరెస్ట్ అయిన బీజేపీ ఎమ్మెల్సీ సీటీరవికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీటీ రవిని బెళగావి కోర్టులో హాజరు పరచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌తో పోలీసులు ఆయన్ను బెంగళూరుకు తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచారు. ఇదే సమయంలో సీటీ రవికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సీటీ రవికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment