బనశంకరీదేవికి గాజుల అలంకారం
బనశంకరి: బనశంకరీదేవి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. పుష్య శుద్ధ అష్టమి మంగళవారం నుంచి శుక్రవారం వరకు వేడుకలు జరుగుతాయి. మంగళవారం వేకువజామున అర్చకులు ఏ.చంద్రమోహన్ అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం నిర్వహించి గాజులు అలంకరణ చేపట్టి విశేష పూజలు జరిపారు. సాయంత్రం 5.30 గంటలకు గోపూజ, గంగాపూజ, మూలదేవత అనుజ్ఞ తదితరాలు నెరవేర్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు. ఈఓ ఎన్.కృష్ణప్ప, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
త్వరలో ఈశ్వరప్ప
క్రాంతివీర బ్రిగేడ్
దొడ్డబళ్లాపురం: స్వామీజీలు, సాధువులతో కలిసి క్రాంతివీర బ్రిగేడ్ ను ప్రారంభించనున్నట్టు మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. బెంగళూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 4న బసవన బాగేవాడిలో బ్రిగేడ్ ప్రారంభోత్సవం జరుగుతుందని, ఇది కుల మతాలకు అతీతంగా ఉంటుందన్నారు. హిందూ మతాన్ని రక్షించుకోవడానికి హిందువులంతా ఏకం కావాలన్నారు.హిందువులు ఇప్పటికైనా మేల్కొనకపోతే రాబోయే తరాలు మూల్యం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ఆరోపించారు.
ఇది దోపిడీ సర్కారు: కుమార
శివాజీనగర: ఆధారాలు ఇవ్వండి...ఆధారాలు ఇవ్వండని అంటున్నారు. దోచుకొంటున్న విధానాన్ని పత్రికలవారే సాక్ష్యాలతో తెలియజేస్తున్నారనేది ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తెలియదా అని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. మీ ప్రభుత్వం కాంట్రాక్టర్‌లను ఏ విధంగా దోచేస్తోందో చెప్పడానికి పత్రికల్లో వస్తున్న వార్తలు చాలని ఎక్స్‌లో విమర్శించారు. కాంట్రాక్టర్లకు రూ. 32 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై మీ పర్సేంటేజ్ నల్ల నీడ కూడా పడింది. అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్‌లు దయా మరణానికి అర్జీ రాస్తున్నారని ఆరోపించారు. గ్యారెంటీలు అని ప్రజలకు చిల్లర ఇచ్చి కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కోర్టుకు నటి రమ్య హాజరు
దొడ్డబళ్లాపురం: ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య మంగళవారంనాడు బెంగళూరులోని కమర్షియల్ కాంప్లెక్స్ కోర్టు ముందు హాజరయ్యారు. హాస్టల్ హుడుగరు బేకాగిద్దారె అనే సినిమా విడుదలను ఆపాలని గతంలో రమ్య కోర్టును ఆశ్రయించారు, ఈ కేసులో విచారణకు వచ్చారు. 2024 జూలైలో రమ్య ఆ సినిమా నిర్మాతపై కేసు వేశారు. తన అనుమతి తీసుకోకుండా సినిమాలో తన దృశ్యాలను వాడుకున్నారని ఆమె చెబుతున్నారు. కాబట్టి సినిమా విడుదల ఆపాలని, తనకు రూ.1 కోటి పరిహారం ఇప్పించాలని కోరారు. విచారణ తరువాత వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment