కార్ణికోత్సవానికి ఏర్పాట్లకు సూచన
హొసపేటె: మైలార కార్ణికోత్సవం, జాతర నిర్వహణకు వివిధ శాఖలు సమన్వయం చేసుకోవాలని జిల్లాధికారి దివాకర్ సూచించారు. మైలార గ్రామంలోని కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన మైలార లింగేశ్వర జాతర, కార్ణికోత్సవం ముందస్తు సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫిబ్రవరి 4 నుంచి 15 వరకు మైలార జాతర, ఫిబ్రవరి 14న సాయంత్రం 5.30 గంటలకు డెంకనమరడిలో కార్ణికోత్సవం నిర్వహించనున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి రావాలంటే తాగునీటి సరఫరా, పరిశుభ్రత, విద్యుత్ దీపాల ఏర్పాటు, రవాణా వ్యవస్థతో పాటు తగిన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యారోగ్య శాఖ నుంచి తాత్కాలిక టెంట్ విధానంలో ఉచిత ఆరోగ్య, అంబులెన్స్ సేవలు అందించాలని డీహెచ్‌ఓ శంకరనాయక్‌ను ఆదేశించారు. ప్రైవేట్ సంస్థలు అందించే బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ ఉపయోగించి శుభ్రపరచడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిబంధనల ప్రకారం సీసీ టీవీలు, విద్యుత్ దీపాలను, డెంకనమరడి దగ్గర ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు రోజుల ముందుగానే మద్యం విక్రయాలను నిషేధించాలని సూచించారు. హడగలి ఎమ్మెల్యే కృష్ణానాయక్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రాకపోకలకు రవాణా శాఖ మరిన్ని బస్సులను కేటాయించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment