ఉత్తమ నటుడు సుదీప్
● ఉత్తమ నటి అనుపమగౌడ
శివాజీనగర: 2019వ సంవత్సర రాష్ట్ర వార్షిక సినిమా పురస్కారాలను ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తమ నటుడుగా సుదీప్‌కు ఫైల్వాన్ సినిమా నటనకు ఎంపిక చేశారు. ఉత్తమ నటిగా అనుపమ గౌడ–త్రయంబకం సినిమాకు, ఉత్తమ తొలి సినిమా–మోహనదాస, పీ.శేషాద్రి దర్శకత్వపు సినిమా, ద్వితీయ ఉత్తమ సినిమా–లవ్ మాక్టెల్, డార్లింగ్ కృష్ణ దర్శకత్వం, తృతీయ ఉత్తమ చిత్రం– ఆర్ఘ్యం, వై శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ఎంపికయ్యాయి. ఉత్తమ సహాయక నటిగా అనుషా కృష్ణ, బ్రాహ్మిం నటనకు ఎంపికై ంది. ఇంకా పలు రంగాలలో ప్రతిభావంతులను ఎంపిక చేశారు. 2019 సినీ అవార్డులను ఇప్పుడు ప్రకటించడం ఏమిటని చాలా మంది నెటిజన్లు సందేహం వ్యక్తంచేశారు. అప్పట్లో కరోనా విపత్తు వల్ల సినిమా అవార్డులను ప్రకటించలేదని, ఇప్పుడు దానిని పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.
2 కార్లను వదిలేసిన దొంగలు
మైసూరు: తాలూకాలోని జయపుర ఫిర్కా గుజ్జేగౌడనపురలో సోమవారం ఉదయం కేరళకు చెందిన వ్యాపారి ఇన్నోవా కారును రెండు కార్లలో వచ్చిన దుండగులు అడ్డగించి రూ.1.5 లక్షల నగదు, కారుతో సహా పరారైన దొంగల కార్లు దొరికాయి. మార్బళ్లి వద్ద బాధితుల కారు లభించగా, గోపాలపుర గ్రామం వద్ద దోపిడీ దొంగల ఇన్నోవా కారు లభించింది. జయపుర పోలీసు స్టేషన్ పరిధిలో ఆరు కిలోమీటర్ల దూరంలో కార్లు దొరికాయి. దొంగల కారుకు నకిలీ ఢిల్లీ నంబరు ప్లేటు ఉంది. కారులో ఐదుకు పైగా నకిలీ నంబరు ప్లేట్లు లభించాయి. దోపిడీ కోసం 6 నుంచి 7 మంది ఉన్న దుండగుల బృందం మూడు కారుల్లో వచ్చారు. ఎరుపు రంగు స్విఫ్ట్ కారు, గ్రే కలర్ ఇన్నోవా కారు, సిల్వర్ కలర్ ఇన్నోవాలో వచ్చారు. వ్యాపారి కారును తమ కారుతో అడ్డగించి దోచుకున్నారు. పెప్పర్ స్ప్రేని వ్యాపారి, డ్రైవర్ ముఖాన కొట్టి, జాకీ రాడ్లతో బాదారని బాధితుడు మహ్మద్ అష్రఫ్ ఫిర్యాదులో తెలిపాడు. దోపిడీ దొంగల పట్టివేతకు గాలింపు చేపట్టారు. ఈ ముఠా చాలా దోపిడీలకు పాల్పడి ఉంటుందని అనుమానాలున్నాయి.
ఏనుగు దాడి.. ఒకరి మృతి
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మిణ్యం గ్రామ పంచాయతీ పరిధిలోని కొప్ప గ్రామం నుంచి అడవిలోకి వెళ్లే రోడ్డులో ఒడెయరపాళ్యకు వెళుతున్న వారిపై అడవి ఏనుగు దాడి చేసి ఒకరిని హతమార్చింది. హనూరు తాలూకా మిణ్యం కొప్ప గ్రామ నివాసి మునియప్ప (40) మృతుడు. మునియప్ప, అతని స్నేహితుడు కుళ్లుచ్చేగౌడ ఒడెయరపాళ్య గ్రామంలో కూలి పని చేశారు. ఒడెయరపాళ్యకు వాపస్ వెళుతుండగా అడవిలో ఏనుగు వారిపై దాడి చేసింది. ఫలితంగా తీవ్రంగా గాయపడిన మునియప్ప అక్కడికక్కడే మరణించాడు. కుళ్లుచ్చేగౌడ స్పృహ తప్పి పడిపోయాడు. గస్తీలో ఉన్న అటవీ సిబ్బంది గమనించి కుళ్లుచ్చేగౌడను చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడు కోలుకున్నాడు.
లారీపై గజ దౌర్జన్యం
యశవంతపుర: చామరాజనగర జిల్లా గుండ్లుపేట బండీపుర అటవీ ప్రొంతంలో అడవి ఏనుగు లారీని అడ్డగించి కాయగూరలను చెల్లాచెదురుగా పడేసింది. మంగళవారం సాయంత్రం గుండ్లుపేట నుంచి బండీపుర మార్గంలో తమిళనాడుకు కాయకూరల లారీ వెళ్తుండగా ఏనుగు అడ్డగించి దాడి చేసింది. డ్రైవర్, క్లీనర్ పరుగులు తీశారు. లారీ నిలిచిపోవడంతో ఇరువైపుల వాహనాలు స్తంభించాయి. రాత్రి 9 గంటల వరకు ఎక్కడివాహనాలు అక్కడి నిలిచి పోయ్యాయి. అటవీశాఖ అధికారులు ఏనుగులు రోడ్డుపై రాకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇలానే అడవి ఏనుగులు కాయకూరల లారీని అడ్డగించినట్లు స్థానికులు తెలిపారు.
డీకేతో విశ్వనాథ్ చర్చలు
శివాజీనగర: మైసూరు జిల్లా బీజేపీ ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్, కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీ.కే.శివకుమార్‌ను భేటీ చేసి చర్చలు జరిపారు. బుధవారం ఉదయం బెంగళూరు సదాశివనగరలోని డీకే శివకుమార్ ఇంటికి వచ్చి అర్ధగంట పాటు రహస్య చర్చలు జరిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండిన విశ్వనాథ్ తరువాత జేడీఎస్‌లో చేరారు. అక్కడ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్రాధ్యక్షునిగా ఉన్నపుడే ఆపరేషన్ కమలం ద్వారా బీజేపీలో చేరారు. తరువాత ఎమ్మెల్సీ అయ్యారు. బీజేపీతో సహా అన్ని పార్టీలను ఆయన విమర్శిస్తూ ఉన్నారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment