తవ్వకాల్లో బంగారం దొరికిందని.. | - | Sakshi
Sakshi News home page

తవ్వకాల్లో బంగారం దొరికిందని..

Published Thu, Jan 23 2025 12:54 AM | Last Updated on Thu, Jan 23 2025 12:54 AM

తవ్వకాల్లో బంగారం దొరికిందని..

తవ్వకాల్లో బంగారం దొరికిందని..

సోమందేపల్లి: తక్కువ ధరకే మేలిమి బంగారాన్ని అందజేస్తామని నమ్మబలికి నకిలీ పసిడిని అంటగట్టి డబ్బుతో ఉడాయించిన కేసులో పది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన రాణా కృష్ణబాబు, కర్ణాటకకు చెందిన శాంతరాజు, నయాజ్‌ అహమ్మద్‌, ఈరన్న, బాబు, అర్జున్‌, ఆనంద్‌బాబు, బంగారి, ఈడిగ హరిప్రసాద్‌ ఓ ముఠాగా ఏర్పడి నకిలీ బంగారం దందా చేపట్టారు. ఈ క్రమంలోనే నకిలీ బంగారపు పూసల దండలు సేకరించుకుని, అందులో కొన్ని అసలు బంగారం పూసలను చేర్చారు. కొనుగోలుదారులు పరీక్షించుకునే సమయంలో మేలిమి బంగారం పూసలను మాత్రమే చూపించేవారు.

ఉత్తుత్తి పూసల దండి ఇచ్చి..

ఇటీవల అనంతపురం జిల్లా విడపనకల్లుకు చెందిన ఈశ్వరన్నకు, చిత్తూరు జిల్లా కుప్పం నివాసి ముని వెంకటేష్‌కు ముఠా సభ్యులు ఫోన్‌ చేసి మాట్లాడారు. తమకు తవ్వకాల్లో బంగారం లభ్యమైందని, తక్కువ ధరకే అమ్ముతామని నమ్మబలికారు. ఇద్దరినీ ఈ నెల 9న సోమందేపల్లి బ్రాహ్మణపల్లి వద్దకు రప్పించుకున్నారు. తొలుత ఈశ్వరన్న నుంచి రూ.8 లక్షలు తీసుకున్నారు. తరువాత ముని వెంకటేష్‌ వద్ద రూ.13 లక్షలు తీసుకుని ఇద్దరికీ నకిలీ బంగారం పూసల దండలు చేతిలో పెట్టి గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించారు. కాసేపటి తర్వాత వాటిని పరిశీలించుకున్న ఈశ్వరన్న, ముని వెంకటేష్‌... నకిలీవని నిర్ధారించుకుని వెంటనే సీఐ రాఘవన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి బుధవారం పక్కా ఆధారాలతో మొత్తం పది మందిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.21 లక్షలతో పాటు ఐదు సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు.

జనాలకు నకిలీ పసిడి అంటగట్టి..

నయవంచక ముఠా అరెస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement