విద్యార్థుల యాత్ర విషాదాంతం
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు పట్టణ పరిధిలో మంగళవారం రాత్రి 11 గంటలప్పుడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వేద విద్యార్థులతో సహా నలుగురు దుర్మరణం చెందారు. వివరాలు.. పొరుగున కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నుంచి కొప్పళ జిల్లాలో గంగావతి తాలూకా ఆనెగొంది నవ బృందావన గడ్డలో జరుగుతున్న నరహరి తీర్థుల ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేద విద్యార్థులు ట్రాక్స్ క్రూయిజర్‌లో బయల్దేరారు. వీరు మంత్రాలయం దేవస్థానానికి చెందిన వేద సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు. వాహనంలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. సింధనూరుకు 4 కి.మీ.దూరంలోని వైష్ణవ దేవి దేవాలయం వద్ద క్రూయిజర్ టైర్ పేలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అందులోని విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. కొందరైతే విసిరేసినట్లు బయటకు పడిపోయారు.
మృతులు వీరే
బళ్లారివాసి హయవదన (18), మంత్రాలయంవాసులు సుజయేంద్ర (22), డ్రైవర్ కంసాలి శివ (20), కొప్పళవాసి అభిలాష్ (20) అక్కడికక్కడే మరణించారు.
క్షతగాత్రులు
బళ్లారివాసులు జయసింహ (23) శ్రీహరి (18), విజయేంద్ర (17), గంగావతివాసి భరత్ (16), తాళికోట వాసి రాఘవేంద్ర (16), రాయచూరు జిల్లా గబ్బూర్ వాసి తనీత్ (13), యాదగిరివాసి శ్రీకర్ (16), కుష్టిగివాసులు వాసుదేవ్ (14), రాఘవేంద్ర (17), నారాయణపేట వాసి బసంత్ శర్మ (15) గాయపడ్డారు.
పాత వాహనం.. అతివేగం
బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. వెంటనే స్థానికులు, పోలీసులు చేరుకుని క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కూడా తరలించారు. బంధుమిత్రుల రోదనలతో ఆస్పత్రి విషాదమయమైంది. సింధనూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. క్రూయిజర్ పాత వాహనం కావడంతో పాటు అతి వేగంతో ప్రయాణించడం వల్ల టైర్ పేలి ఇంతటి ఘోరం జరిగిందని అనుమానాలున్నాయి. మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థస్వామి, సీఎం సిద్దరామయ్య తదితరులు సంతాపం తెలిపారు.
సింధనూరు వద్ద క్రూయిజర్ పల్టీ
డ్రైవర్, ముగ్గురు వేద విద్యార్థుల మృతి
10 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment