![లోకాయుక్త దాడులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06bng34-120028_mr-1738870983-0.jpg.webp?itok=2tbOLOxF)
లోకాయుక్త దాడులు
● జీపీ అధ్యక్షురాలి భర్త, ఉపాధ్యక్షుడు పట్టివేత
మండ్య: స్థలం విషయంలో ఓ రైతు నుంచి లక్ష రూపాయలను లంచంగా తీసుకుంటూ శెట్టిహళ్ళి గ్రామ పెద్దలు లోకాయుక్తకు దొరికారు. మండ్య జిల్లాలోని మళవళ్ళి తాలూకాలోని శెట్టిహళ్ళి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామ పంచాయతీ అధ్యక్షురాలి భర్త అయిన శేఖర్, ఉపాధ్యక్షుడు మనోహర్ పట్టుబడినవారు. వివరాలు.. గురుప్రసాద్ అనే రైతుకు 2.4 ఎకరాల భూమి ప్రభుత్వ పాఠశాలకు ఆనుకునే ఉంది. పాఠశాల స్థలం కబ్జాకు గురైందని కొందరు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు పరిశీలించి హద్దులు గుర్తించారు. ఈ సమయంలో రైతు గురుప్రసాద్ భూమికి సమస్యలు వచ్చాయి. ఆయన పై ఇద్దరినీ కలవగా రూ. 12 లక్షలు తమకు ఇస్తే, సమస్యను తీరుస్తామని తెలిపారు. చివరకు రూ. 8 లక్షలకు ఒప్పుకున్నారు. ఇది లోకాయుక్తకు తెలిసింది. గురువారం ఓ ఆలయం వద్ద రూ. లక్ష ను తీసుకుంటూ ఉండగా ఇద్దరినీ అరెస్టు చేశారు. లోకాయుక్త ఎస్పీ సురేష్‌బాబు సూచనతో డిఎస్‌పీ సునీల్‌కుమార్, సీఐ బ్యాటరాయనగౌడ పాల్గొన్నారు.
హుళియారులో మళ్లీ తనిఖీ
తుమకూరు: జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా హుళియారు పట్టణ పంచాయతీ కార్యాలయాన్ని లోకాయుక్త ఇన్‌స్పెక్టర్ సురేష్ తనిఖీలు చేశారు. పెండింగ్‌లో ఉన్న భూ, స్థల ఖాతాల దరఖాస్తులను పరిశీలించారు. తన స్థలాన్ని ఖాతా చేయడం లేదని ఓ మహిళ ఇటీవల మీడియా ముందు విలపించారు. దీంతో లోకాయుక్త కన్ను పడింది. పట్టణ పంచాయతీలో అక్రమ ఖాతాలను చేయించి ఇస్తున్నారని, ఓ పౌరకార్మికుడు అధికారం చలాయిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు మేరకు గత శుక్రవారం ఆకస్మికంగా సోదాలు చేయగా ముఖ్యాధికారి వద్ద ఉండాల్సిన డాంగల్ పౌరకార్మికుని వద్ద ఉంది. దీంతో పంచాయతీలో అక్రమాలకు ఇది సాక్ష్యంగా నిలిచింది. ఇద్దరినీ విచారించి కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ మళ్లీ తనిఖీలకు వచ్చారు. ముఖ్యాధికారి ఎస్.నాగభూషణ్ తుమకూరులో సమావేశానికి వెళ్లారు, ఆర్‌ఓ శృతి, మల్లికార్జునయ్యలను ప్రశ్నించారు. ఖాతాలను సక్రమంగా పరిష్కరిస్తున్నారా అనేది తెలుసుకున్నారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ పంచాయతీలో అక్రమాలు జరిగినట్లు దాఖలాలు లభించాయని, లోకాయుక్తకు నివేదిక సమర్పిస్తానన్నారు. అక్రమార్కులకు శిక్ష పడటం ఖాయం అని చెప్పారు. పంచాయతీలో పౌర కార్మికుడైనా, అక్రమంగా కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్న ఆనంద్ ఆఫీసుకు రాలేదు. దాడుల సమాచారం ముందే లీకై ందా అనేది సందేహంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment