1
కొబ్బరిలో నంబర్
హాసన్‌జిల్లాలో టెంకాయ తోటలు
బనశంకరి: కొబ్బరి చెట్టు ఉంటే కోటి ఉపయోగాలన్నారు. అందుకే కల్పవృక్షంగా పేరుగాంచింది. ఇప్పుడు రైతులకు కాసుల పంట పండిస్తోంది. ఇప్పటివరకు కొబ్బరి పంట ఉత్పాదనలో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో ఉండేది. కానీ నేడు మలయాళీలను వెనక్కినెట్టిన కర్ణాటక అత్యధిక కొబ్బరి ఉత్పత్తిచేసే రాష్ట్రంగా నిలిచింది. కొబ్బరికాయ అభివృద్ధి మండలి (సీడీబీ) ప్రకారం 2022– 23లో కేరళ 563 కోట్ల కొబ్బరికాయలు ఉత్పత్తిచేయగా కర్ణాటక 595 కోట్ల కొబ్బరికాయలను పండించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచింది.
726 కోట్ల కాయలతో ఫస్టు
2021–22లో కేరళ 552 కోట్ల కొబ్బరికాయలను ఉత్పత్తి చేసింది. ఇదే అవధిలో కర్ణాటకలో 518 కోట్ల కొబ్బరికాయలు పండాయి.
2023–24 అవధిలో కర్ణాటక 726 కోట్ల టెంకాయలను ఉత్పత్తిచేయడం ద్వారా దేశంలో ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. తమిళనాడు 578 కోట్ల కొబ్బరికాయలతో రెండో స్థానంలో ఉంది. కేరళ 564 కోట్ల టెంకాయలతో తృతీయ స్థానంలోకి పడిపోయింది.
కేరళ కంటే కర్ణాటకలో అధిక దిగుబడి
రైతులకూ మంచి ధరలు
తుమకూరు అగ్రస్థానం
కన్నడనాట తుమకూరు, హాసన్, మండ్య జిల్లాల్లో అధిక ప్రమాణంలో కొబ్బరి తోటలు ఉన్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరుగా సాగవుతోంది. మొత్తం 10 జిల్లాల్లో బాగా సాగులో ఉంది. చెట్టు తక్కువ ఎత్తు పెరిగి, స్వల్ప కాలంలో కాయలు కాచే వంగడాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో బెంగళూరులో ఉద్యోగాలు చేసే యువజనం కూడా కొబ్బరి సేద్యం వైపు వెళ్తున్నారు. రైతులు పెరగడంతో ఉత్పత్తి కూడా ఇనుమడించింది. తుమకూరు జిల్లాలో బృహత్ విస్తీర్ణంలో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. కొబ్బరి ఉత్పాదనలో కూడా తుమకూరు మొదటి స్థానం పొందింది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద కొబ్బరిమార్కెట్ జిల్లాలోని తిపటూరులో ఉంది. 2024లో రికార్డు స్థాయిలోకి కొబ్బరి ధర చేరడంతో రైతులకు, వ్యాపారులకు లాభాల పంట పండింది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ప్రస్తుతం క్వింటాల్ కొబ్బరి రూ.12,000 నుంచి 14 వేల మధ్య సాగుతోంది. మునుముందు ధర పెరిగే అవకాశం ఉందని కొబ్బరి రైతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment