![మళ్లీ ఢిల్లీకి యత్నాళ్ వర్గం!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09bng121_mr-1739128217-0.jpg.webp?itok=G8EbSjNB)
మళ్లీ ఢిల్లీకి యత్నాళ్ వర్గం!
యశవంతపుర: విజయేంద్ర, యడియూరప్పకు వ్యతిరేకంగా బీజేపీ రెలెల్స్ నాయకులు మళ్లీ ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. దావణగెరెలో బసనగౌడ పాటిల్ యత్నాల్ బృందం మకాం వేసింది. యత్నాళ్, ఇతర నేతలు ఆదివారం దావణగెరెలో జెఎంఐటీ అతిథి గృహంలో విలేరులతో మాట్లాడారు. తమ బృందం మళ్లీ ఢిల్లీకి వెళ్తుందని యత్నాళ్ తెలిపారు. తమ పోరాటం, ప్రయత్నాలను కొనసాగిస్తామన్నారు. ఇంకా ఎన్ని రోజులు పోరాడుతారని ప్రశ్నించగా, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నారు. దావణగెరెలోను రెండు పందులు వాగుతున్నాయి, మీము ఢిల్లీకి వెళ్లి అన్నీ మాట్లాడుతామని ప్రత్యర్థులపై ధ్వజమెత్తారు. మాజీ మంత్రి శ్రీరాములు నిర్ణయం బాగుందని, ఆయనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తము అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్నట్లు చెప్పారు.
హుటాహుటిన ఢిల్లీకి విజయేంద్ర
శివాజీనగర: దావణగెర జిల్లా హరిహర తాలూకాలోని రాజనహళ్ళిలో వాల్మీకి జాతర జరుగుతుండగా ఆదివారం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర అందులో పాల్గొనేందుకు వెళుతున్నారు. ఇంతలో ఢిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు రావడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఢిల్లీకి వెళ్లారు. బెంగళూరులోని నెలమంగల వద్ద ఉండగానే కాల్ రావడంతో హస్తిన బాట పట్టారు. అసమ్మతి వర్గం, పదవిలో కొనసాగింపు తదితరాలపై చర్చించే అవకాశముందని సమాచారం.
పాప్ స్టార్ పాటకు బ్రేక్
● బెంగళూరులో అడ్డుకున్న పోలీసులు
శివాజీనగర: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పాప్ గాయకుడు ఎడ్ షీరన్ షో కోసం సంగీతప్రియులు చెవి కోసుకుంటారు. అతని దర్శనమైతే చాలని తపిస్తారు. కానీ అలాంటి పాప్ స్టార్‌కు బెంగళూరులో చేదు అనుభవం ఎదురైంది. షో మధ్యలో పోలీసులు వచ్చి నిలిపివేశారు.
అనుమతి లేదంటూ
బెంగళూరు చర్చ్ స్ట్రీట్‌లో బహిరంగ ప్రదేశంలో ఎడ్ షీరన్ కచేరీ జరుగుతుండగా పోలీసులు వచ్చి అడ్డుకొన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. షీరన్ బృందం భారత పర్యటనకు వచ్చింది. పలు నగరాలలో ప్రదర్శనలు ఇవ్వనుంది. అదే మాదిరిగా చర్చ్ స్ట్రీట్‌లో ఉత్సాహంగా షో మొదలైంది. ఒక నిమిషం అయ్యిందో లేదో పోలీసులు వచ్చి మైక్‌ల వైర్లను తొలగించారు. నిర్వాహకులు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ప్రదర్శనను తక్షణమే బంద్ చేయడంతో ప్రేక్షకులు అసంతృప్తి చెందారు.
రుణ వేధింపులపై కేసు
శివాజీనగర: రూ.1.60 లక్షల రుణం తీసుకుని వడ్డీతో సహా రూ.3.80 లక్షలు చెల్లించారు, కానీ ఇంకా వడ్డీ కట్టాలని వేధిస్తున్నారంటూ ఫిర్యాదు నమోదైంది. బాధితుల తరఫున కో– ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శశీంద్ర, అశోక్ దంపతులపై అక్రమ నగదు బదిలీ – అధిక వడ్డీ వసూలు నిషేధ చట్టం కింద సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. జయనగర సిద్ధాపుర కే.ఎం.కాలనీకి చెందిన సమ్రీన్ తాజ్ తన సోదరి వివాహం నిమిత్తం బంధువు మహమ్మద్ రఫీక్, శశీంద్ర, అశోక్‌ల నుంచి గతంలో రూ.1.60 లక్షలు అప్పు తీసుకుంది. వడ్డీ చెల్లించటం ఆలస్యమైనపుడు ఫోన్ చేసి అసభ్యకరంగా దూషించేవారని బాధితురాలు తెలిపింది. 2023 నవంబర్ నుంచి ప్రతి నెలా అసలు వడ్డీ కలిపి రూ. 15 వేలు సొమ్మును శశీంద్రకు ఫోన్ పే ద్వారా చెల్లించానని, పూర్తిగా కట్టినా ఇంకా చెల్లించాలని వేధిస్తున్నారని వాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment