వేణుగోపాల రథోత్సవం
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లా అరకలగూడు తాలూకాలో ఉన్న దొడ్డమగ్గె గ్రామంలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మరథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఉదయం నుంచి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం చేశారు. ఉత్సవమూర్తిని అలంకరించి సూర్య మండలోత్సవం, కృష్ణ గంధోత్సవం నెరవేర్చారు. ఎమ్మెల్యే ఎ.మంజు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తిని తేరులో ప్రతిష్టించి రథాన్ని ముందుకు లాగారు. వేలాది భక్తులు గోవిందా అంటూ అరటిపండ్లను తేరు మీదకు విసిరారు.
బీజేపీ రెబెల్ నేత యత్నాళ్‌కు నోటీసు
దొడ్డబళ్లాపురం: రాష్ట్ర బీజేపీలో కొరకరాని కొయ్యగా మారిన తిరుగుబాటు ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌కు పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. మాజీ సీఎం యడియూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలపై ఎందుకు ఆరోపణలకు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మూడురోజుల లోపు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని తెలిపింది. ఇప్పుడు యత్నాళ్ ఏం చేయబోతున్నారనేది కుతూహలంగా మారింది.
కేంద్రమంత్రి ఇంట్లో రెబెల్స్
యశవంతపుర: కేంద్ర ఇంధన, రైల్వే శాఖ సహాయ మంత్రి వీ సోమణ్ణ ఢిల్లీలోని తన ప్రభుత్వ బంగ్లాలో పూజలు నిర్వహించారు. బీవై విజయేంద్ర ఈ కార్యక్రమానికి వెళుతున్నట్లు చెప్పినా కూడా వెళ్లలేదు. అయితే ఢిల్లీలోనే మకాం వేసిన రెబెల్ నాయకులు యత్నాళ్, అరవింద లింబావళి, కుమార బంగారప్ప, మహేశ్ కుమటళ్లి సోమణ్ణ బంగ్లాకు వెళ్లడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
ఇద్దరు నక్సలైట్ల తరలింపు
శివమొగ్గ: గత నెల ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమక్షంలో ఆరుమంది మహిళా నక్సలైట్లు లొంగిపోయారు. వారిలో ఇద్దరు నక్సలైట్లను విచారణ కోసం శివమొగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ నక్సల్ ముండగారు లత, వనజాక్షి బాళెహోళెను తీసుకొచ్చారు. గతంలో తీర్థహళ్ళి తాలూకాలోని ఆగుంబె ఠాణా పరిధిలో 2 కేసులు, హోసనగర పరిధిలో ఒక కేసు నమోదై ఉన్నాయి. ఆ కేసుల్లో వారిని మంగళవారం కోర్టులో హాజరు పరుస్తారు.
రూ.150 కోట్లు కట్టండి!
● కోవిడ్ స్కాంలో సర్కారు చర్యలు
దొడ్డబళ్లాపురం: ఐదేళ్ల కిందట కోవిడ్ సమయంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం వైద్య పరికరాల కొనుగోలులో వందలాది కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని సిద్దరామయ్య సర్కారు ఆరోపిస్తోంది. కొన్నిమాసాల కిందట జస్టిస్ మైకేల్ కున్హా విచారణ కమిషన్‌ను కూడా నియమించింది. అయితే అవన్నీ మర్చిపోతున్న తరుణంలో ఆరోగ్యశాఖ షాక్ ఇచ్చింది. ఏకంగా 200 కంపెనీలకు, పలువురు అధికారులకు నోటీసులు జారీచేసింది. అంతేకాదు, రూ.150 కోట్లను తిరిగి వసూలు చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది. కున్హా నివేదిక ఆధారంగా ఆరోగ్యశాఖ ఆధీనంలో ఉన్న కేఎస్‌ఎంఎస్‌సీఎల్ సుమారు 200 కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. కొన్ని కంపెనీలు అప్పటి పరిస్థితికి తగినట్టు ధరలు పెట్టామని, రవాణా ఖర్చులు కూడా చేర్చామని సమాధానం ఇచ్చాయి. ఈ చర్యలతో కోవిడ్ వస్తుసామగ్రి కొనుగోళ్లతో సంబంధం ఉన్న అధికారుల్లోను గుబులు మొదలైంది.
బాబోయ్.. దప్పిక
మండ్య: ఎండాకాలం పూర్తిగా రాకముందే అనేకచోట్ల మంచినీటికి కటకట ఏర్పడింది. జీవనది కావేరమ్మ జలజలా ప్రవహించే మండ్య జిల్లాలోనే ఈ దుస్థితి నెలకొంది. శ్రీరంగ పట్టణం తాలూకాలోని చిన్నాయకనహళ్ళి గ్రామస్తులు సోమవారం పంచాయతి ఆఫీసు ముందు తాగునీరు కావాలంటూ ఖాళీ బిందెలు తీసుకొని వచ్చి ధర్నా చేశారు. అక్కడే భోజనం కూడా తిన్నారు. గ్రామంలో మంచినీళ్లు దొరకడం లేదని, గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సక్రమంగా తాగునీరు సరఫరా చేయాలని నినాదాలు చేశారు. మహిళలు, పిల్లలు కూడా పాల్గొన్నారు.
వేణుగోపాల రథోత్సవం
వేణుగోపాల రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment