![వీఏఓల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bng36-120028_mr-1739212672-0.jpg.webp?itok=5GPrBaeJ)
వీఏఓల నిరసన
తుమకూరు: రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న వీఏఓలు సామూహిక సెలవు పెట్టి ధర్నా నిర్వహించారు. అధికారులకు, ఉద్యోగులకు తలలో నాలుకలా ఉండే తమ సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది వచ్చి తుమకూరు కలెక్టరేట్ ముందు బైఠాయించారు. తమకు తగిన ఆఫీసులు ఇవ్వాలని, ఫర్నిచర్ కల్పించాలని, మొబైల్, సిమ్‌కార్డు, వాటి బిల్లులు మంజూరు చేయాలన్నారు. అలాగే కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు అందజేయాలని కోరారు.
కామాంధులకు జైలుశిక్ష
మైసూరు: బాలిక పైన లైంగిక దాడి చేసిన కేసులో ఇద్దరు కామాంధులకు పోక్సో కోర్టు కఠిన శిక్షలు విధించింది. దోషులు బబిశాల్ ముండా, బాలిక మారు తండ్రి అయిన రిషి బేహర్‌లు. వివరాలు.. మైసూరు కడకొళ పారిశ్రామికవాడలో వీరు కూలీ పనులు చేసుకునేవారు. గతేడాది ఏప్రిల్ 7వ తేదీన బాలికను ప్రేమపేరుతో నమ్మించి లైంగికదాడి చేశాడు. మళ్లీ బెంగళూరు తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని అరెస్టు చేసి బాలికను కాపాడారు. బాలిక మారుతండ్రి రిషి బేహర్ కూడా బాలికపైన లైంగిక దాడి చేసినట్లు ఆమె తల్లి విచారణలో తెలిపింది. ఇన్స్‌పెక్టర్ యోగనంజప్ప ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. మైసూరు పోక్సో కోర్టు విచారణలో నేరం రుజువైంది. బిశాల్ ముండాకు జీవితఖైదు, మారుతండ్రికి 5 ఏళ్ల కారాగారశిక్ష విధించారు. అలాగే రూ. 25 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి ఆనంద్ పి.హెగడె తీర్పు చెప్పారు.
నేటి నుంచి పెట్టుబడుల సదస్సు
శివాజీనగర: పెట్టుబడిదారుల సమావేశం ఇన్వెస్ట్ కర్ణాటక 2025 నేడు మంగళవారం నుంచి బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 3 రోజుల పాటు జరుగుతుంది. మధ్యాహ్నం కేంద్ర రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ ప్రారంభిస్తారు. ఏర్పాట్లను డీసీఎం డీకే శివకుమార్, మంత్రి ఎంబీ పాటిల్ పరిశీలించారు. పెద్దసంఖ్యలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొంటారని తెలిపారు. నూతన పరిశ్రమల విధానం, అనుమతులు ఇవ్వడానికి సింగల్ విండో పోర్టల్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామిక వస్తుసామగ్రితో పెద్దసంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. ప్రారంభోత్సవంలో గవర్నర్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాల్గొంటారు.
పెళ్లి వరకూ రాని ప్రేమ
● భగ్న ప్రేమికుని ఆత్మహత్య
యశవంతపుర: ప్రేమించిన యువతితోనే జీవితం అనుకున్నాడు. కానీ ఆమె పెళ్లికి ససేమిరా అనడంతో ప్రాణాలే తీసుకున్నాడు. ఈ విషాద ఘటన హాసన జిల్లా అరసికెరె తాలూకా బైరగొండనహళ్లి గ్రామంలో జరిగింది. దర్శన్ (22) బేవినహళ్లిలోని అవ్వ ఇంటిలో ఉంటూ కాలేజీకి వెళ్లేవాడు. బేవినహళ్లికి చెందిన యువతి, దర్శన్ ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. బీఏ పూర్తి చేశాక సొంతూర్లో సేద్యం చేస్తున్నాడు. ప్రేమించుకున్నది చాలు, పెళ్లి చేసుకొందామా? అని దర్శన్ యువతిని అడిగాడు. కానీ ఆమె ఇందుకు నిరాకరించింది. దీంతో విరక్తి చెందిన దర్శన్ ఈ నెల 5న ఇంటిలో పురుగుల మందు తాగాడు. అస్వస్థతకు గురైన దర్శన్ వాంతులు, విరేచనాలు చేసుకున్నాడు. స్నేహితులు రవి, యశ్వంత్‌లు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పి కుప్పకూలిపోయాడు. అతనిని అరసికెరె ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మైసూరు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. అరసికెరె గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
![వీఏఓల నిరసన 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10bng24-120041_mr-1739212672-1.jpg)
వీఏఓల నిరసన
Comments
Please login to add a commentAdd a comment