మైసూరు: కదులుతున్న ప్రైవేట్ బస్సులోనుంచి కిందపడి మహిళ చనిపోగా, ఆమె మనవరాలు గాయపడింది. జిల్లాలోని హెచ్‌డి కోటె తాలూకాలోని లక్ష్మీపుర గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇదే తాలూకాలోని బడగలపుర గ్రామానికి చెందిన నింగేగౌడ భార్య రేణుక (49), మనవరాలిని తీసుకుని పొరుగూరిలో నూతన గృహ ప్రవేశానికి హాజరై సంతోషంగా గడిపింది. భోజనాలు చేసుకుని తిరుగుముఖం పట్టింది. ఆమె ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు మైసూరు– మానందవాడి జాతీయ రహదారిలో లక్ష్మీపుర గ్రామంలో మలుపు వద్ద సడన్ బ్రేక్ వేసింది. వెనుకాల డోర్ వద్ద సీట్లలో కూర్చుని ఉన్న రేణుక, బాలిక ఒక్క ఉదుటన ఎగిరి బయటకు పడిపోయారు. రేణుక తీవ్ర గాయాలై చనిపోగా, బాలికకు దెబ్బలు తగిలాయి. బాలికను మైసూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment