![ఏనుగుతో పరాచకాలు, జరిమానా వేటు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bng13-120024_mr-1739212673-0.jpg.webp?itok=NNPQsegn)
ఏనుగుతో పరాచకాలు, జరిమానా వేటు
మైసూరు: అడవిలో నుంచి రోడ్డుపైకి వచ్చిన ఏనుగును ఆటపట్టించిన వ్యక్తికి గుణపాఠం ఎదురైంది. అతనికి అటవీశాఖ రూ. 25 వేల జరిమానా విధించిన ఉదంతం చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె పట్టణం సమీపంలో జరిగింది. వివరాలు.. గుండ్లుపేటెవాసి షాహుల్ హమిత్‌కు జరిమానా పడింది. ఇటీవల సమీపంలోని బండీపుర అరణ్యంలో రోడ్డుపైకి అడవి ఏనుగు వచ్చింది. హమిత్ దానిని చూసి కేకలు వేస్తూ ఏనుగును బెదిరించాడు. మళ్లీ అది ముందుకు వస్తే పరుగులు తీస్తూ రభస చేశాడు. పైగా దీనిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. చివరకు ఏనుగు ఘీంకరిస్తూ అడవిలోకి వెళ్లిపోయింది. తన ఘనకార్యం చూడండీ అంటూ అతడు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జోసెఫ్ హోవర్ అనే పరిసర కార్యకర్త చూసి, బండీపుర అటవీ అధికారులకు షేర్ చేసి ఫిర్యాదు చేశాడు. అడవి జంతువును ఇలా బెదిరించడం నేరమని తెలిపాడు. దీంతో అటవీ అధికారులు హమిత్‌ను అదుపులోకి తీసుకుని రూ. 25 వేల జరిమానా విధించి, ఇంకోసారి ఇలా చేయవద్దని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment