అంతకు మించి... | Sakshi
Sakshi News home page

అంతకు మించి...

Published Tue, May 7 2024 4:25 AM

అంతకు

● జిల్లాలో గణనీయంగా పెరిగిన విద్యుత్‌ వినియోగం ● గత ఏడాదితో పోలిస్తే మరింత పైకి... ● గృహ వినియోగమే అధికం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైన విద్యుత్‌ శాఖ

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. కొద్ది రోజులుగా కేటాయింపు(కోటా)కు మించి జిల్లాలో వినియోగం నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. అక్కడక్కడ బోర్లు, బావుల కింద పంటలు సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 1.85 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవడంతో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గింది. కానీ ఎండల కారణంగా ఇళ్లలో ఉపకరణాల వాడకం ఎక్కువవడంతో గృహ విద్యుత్‌ వినియోగం మాత్రం గణనీయంగా నమోదవుతోంది.

మండుతున్న ఎండలు

ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా.. రాష్ట్రంలోకెల్లా జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ నెలంతా 40–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఈనెల 1న ఏకంగా 17 ప్రాంతాల్లో 45 నుంచి 46.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తుండగా జిల్లాకు కేటాయించిన దానికి కన్నా విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. జిల్లాలో అత్యధికంగా ఖమ్మం టౌన్‌ డివిజన్‌లో వినియోగం నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 4.73 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరగాల్సి ఉండగా, 5.80 మిలియన్‌ యూనిట్లుగా నమోదవుతోంది. ఈనెల 1నుంచి 3వ తేదీ వరకు జిల్లా కోటా 14.19 మిలియన్‌ యూనిట్లు కాగా, 17.24 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగించారు. ఇక 4, 5వ తేదీల్లో అదే పరిస్థితి ఉన్నా 6వ తేదీ సోమవారం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మే నెలంతా ఎండలు మండిపోనుండడంతో విద్యుత్‌ వినియోగం గరిష్ట స్థాయిలో నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

గత ఏడాదితో పోలిస్తే

మరింత

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్‌ వినియోగం భారీగా పెరగడానికి వర్షాబావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలే కారణమని తెలుస్తోంది. గత ఏడాది జిల్లాకు కేటాయించిన కోటా కన్నా తక్కువ వినియోగమే నమోదైంది. కానీ ఈసారి అంతకు మించి వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో సుమారు 6.60 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా.. ఇందులో గృహ కనెక్షన్లు 4.75 లక్షలు, వ్యవసాయ రంగంలో 1.13 లక్షలు, వాణిజ్య కనెక్షన్లు 57 వేలు, పరిశ్రమలకు 875 కనెక్షన్లు, ఇతరత్రా 11 వేలకు పైగా ఉన్నాయి. ఇందులో ఈ ఏడాది గృహ కనెక్షన్ల విద్యుత్‌ వినియోగమే పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.

అవాంతరాలు లేకుండా..

పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా జిల్లాలో విద్యుత్‌ శాఖ అధికారులు అవాంతరాలు లేకుండా సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గడిచిన ఏడాదిలో జిల్లాలోని పమ్మి, అల్లీపురంతో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో నూతన సబ్‌ స్టేషన్లు నిర్మించారు. అయినా ఖమ్మం నగర విస్తీర్ణం పెరిగి అంతరాయాలు చోటు చేసుకోవడంతో మమతా రోడ్డులోని సబ్‌ స్టేషన్‌లో 5 ఏవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. ఇక ఏడాది కాలంగా జిల్లాలో 441 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేయగా.. అంతరాయం లేకుండా సరఫరాకు అధికారులు కృషి చేస్తున్నారు.

నిరంతర విద్యుత్‌ సరఫరా

అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఈ ఏడాది గృహ విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. అయినా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించి సమస్య తలెత్తకుండా చూస్తున్నాం. ప్రస్తుతం నిత్యం ఒక మిలియన్‌ యూనిట్ల మేర అదనపు విద్యుత్‌ వినియోగం నమోదవుతోంది.

– ఏ.సురేందర్‌, ఎస్‌ఈ,

ఎన్పీడీసీఎల్‌ ఖమ్మం సర్కిల్‌

గత ఏడాది, ఈ ఏడాది విద్యుత్‌ వినియోగం (మిలియన్‌ యూనిట్లలో)

ఏడాది మార్చి ఏప్రిల్‌

2023 161.40 202.19

2024 175.65 225.19

ఈనెలలో జిల్లా కోటా, వినియోగం (మిలియన్‌ యూనిట్లలో)

తేదీ కోటా వినియోగం

01 4.73 5.65

02 4.73 5.79

03 4.73 5.80

అంతకు మించి...
1/4

అంతకు మించి...

అంతకు మించి...
2/4

అంతకు మించి...

అంతకు మించి...
3/4

అంతకు మించి...

అంతకు మించి...
4/4

అంతకు మించి...

Advertisement

తప్పక చదవండి

Advertisement