వర్షం.. రైతుల్లో కల్లోలం
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాన ● పంటలు చేతికందే దశలో ఆందోళన ● ఖమ్మం మార్కెట్‌లో తడిసిన పత్తి బస్తాలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వాతావరణం మామూలుగానే ఉన్నా ఆతర్వాత ఒక్కసారిగా చల్లబడింది. అనంతరం పలుచోట్ల వర్షం కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. చేతికొచ్చిన పత్తి, ఇతర పంటలకు వర్షం నష్టం చేస్తోందని దిగులు చెందారు. కాగా, జిల్లాలోని పెనుబల్లి లో 50 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 28.3, కొణిజర్ల మండలం పెద్దగోపతిలో 22.3, సత్తుపల్లి మండలం గంగారంలో 21.3, కొణిజర్లలో 20.8, రఘునాథపాలెం మండలం మంచుకొండలో 11, మధిర మండలం సిరిపురంలో 7.5, రఘునాథపాలెంలో 6.8, వైరాలో 4, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 3, తల్లాడలో 2.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. బుధవారం రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
పంటలకు ప్రతికూలం
ప్రస్తుతం కురుస్తున్న వానలు పంటలకు ప్రతికూలమనే చెబుతున్నారు. పత్తి తీతలు జోరుగా సాగుతుండగా, తొలినాళ్లలో వరి సాగు చేసిన రైతులు కోతలు మొదలుపెట్టారు. ఇదే సమయాన కురుస్తున్న వానలతో పత్తి రంగు మారడమే కాక నేల రాలుతోంది. అలాగే, కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం రంగు మారే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్‌లో తడిసిన పత్తి బస్తాలు
ఖమ్మంవ్యవసాయం/తల్లాడ: బుధవారం కురిసిన వర్షానికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో విక్రయానికి తీసుకొచ్చిన పత్తి బస్తాలు తడిశాయి. అయితే రైతులు అప్పటికే పంటను వ్యాపారులకు విక్రయించారు. వ్యాపారులు కాంటా పెట్టించి గోదాములకు తరలిస్తున్న క్రమాన వర్షం రావడంతో పత్తి బస్తాలపై టార్పాలిన్లను కప్పించారు. కొన్ని బస్తాలు తడవడంతో షెడ్లలోకి తరలించారు. ఇక తల్లాడ మండలం మిట్టపల్లి, నూతనకల్ గ్రామాల్లో వర్షంతో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడుస్తుండడంతో రైతులు పట్టాలు కప్పారు.
Comments
Please login to add a commentAdd a comment