లేఖ రాయండి.. బహుమతి పొందండి!
● పోస్టల్ శాఖ ఆధ్వర్యాన లెటర్ రైటింగ్ పోటీలు ● విజేతలకు నగదు బహుమతి ● డిసెంబర్ 14 పోటీలకు తుది గడువు
ఖమ్మంగాంధీచౌక్: లేఖ రాయడాన్ని ఈ తరం మరిచిపోయినా పాత తరం వారికి మాత్రం ప్రత్యేక అనుభవం. ప్రేమ, భావాల అందాన్ని ప్రదర్శించే లేఖా రచనలో భారత తపాలా శాఖ ‘ధాయ్‌ు అఖర్’ పేరిట పోటీలు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో ‘రచనానందం, డిజిటల్ యుగంలో ఉత్తరాల ప్రాధాన్యత’ అంశంపై తెలుగు, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో లెటర్ రాయొచ్చు. ఇంగ్లిష్‌లో The joy of writing: Importence of letters in a Digital Age అంశంపై లెటర్ రాయాల్సి ఉంటుంది.
రెండు కేటగిరీల్లో..
లెటర్ రైటింగ్ పోటీలను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తున్నారు. 18ఏళ్ల లోపు ఒక కేటగిరీగా, ఆపై వయస్సు కలిగిన వారిని రెండో కేటగిరీగా పరిగణిస్తారు. మొదటి కేటగిరీ వారు ఇన్‌లాండ్ లెటర్‌లో, రెండో కేటగిరీ వారు ఎన్వలప్ వినియోగించాలి. ఇన్‌లాండ్ లెటర్‌లో 500 పదాల లోపు రాయాల్సి ఉంటుంది. ఇక రెండో కేటగిరీ వారు ఏ–4 సైజు పేపర్‌లో వెయ్యి పదాల లోపు లేఖ రాసి కవర్‌లో పెట్టి పంపించాలి. లెటర్లను ‘చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్’ చిరునామాకు డిసెంబర్ 14 లోగా చేరేలా ఉంటుంది.
జాతీయ, సర్కిల్ స్థాయిలో బహుమతులు
లెటర్ రైటింగ్ పోటీల్లో విజేతలకు తపాలా శాఖ బహుమతులు అందిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ. 50 వేలు, ద్వితీయ బహుమతి రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఇస్తారు. ఇక సర్కిల్ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి రూ.25 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు ఇవ్వనున్నారు.
గతంలో పలువురు విజేతలు
తపాలా శాఖ గతంలో నిర్వహించిన లెటర్ రైటింగ్ పోటీల్లో ఖమ్మంకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 2022–23లో నిర్వహించిన పోటీల్లో 18ఏళ్ల లోపు విభాగంలో కె.జస్విత(శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఖమ్మం), ఓ.ఉమామహేశ్వరి(జెడ్పీహెచ్‌ఎస్ బల్లేపల్లి) ద్వితీయ బహుమతిగా రూ.10 వేల చొప్పున సర్కిల్ స్థాయిలో గెలుచుకున్నారు. 18ఏళ్లకు పైబడిన విభాగంలో సర్కిల్ స్థాయిలో గోల్కొండ భావన(ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఖమ్మం) ద్వితీయ బహుమతిగా రూ.10వేలు గెలుచుకోగా, యలమద్ది సుచి(ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఖమ్మం) తృతీయ బహుమతిగా రూ.5వేలు గెలుచుకున్నారు. ఇక 2023–24లో 18 ఏళ్ల లోపు ఎన్వలప్ విభాగంలో బి.ఆరాధ్య(త్రివేణి టాలెంట్ స్కూల్, ఖమ్మం) ప్రథమ బహుమతి రూ.25 వేల నగదు గెలుచుకోవడం విశేషం.
పోటీలు ఓ సదవకాశం..
లెటర్ రైటింగ్ పోటీలు విద్యార్థులు, యువతకు సదవకాశం. పోటీల్లో విజేతలుగా నిలిచే వారికి తపాలా శాఖ జాతీయ సర్కిళ్ల స్థాయిలో నగదు బహుమతులు అందిస్తుంది. మరిన్ని వివరాలకు సమీప తపాలా కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదంటే www. indiapost.gov.in వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
– వివీరభద్రస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్, ఖమ్మం డివిజన్
Comments
Please login to add a commentAdd a comment